
జూరాలకు కొనసాగుతున్న వరద
● ప్రాజెక్టుకు 2. 14లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● ప్రాజెక్టు 24 క్రస్టు గేట్ల ఎత్తివేత
● ప్రాజెక్టు నుంచి లక్షా 98వేల
437 క్యూసెక్కుల నీరు విడుదల
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు 2లక్షల 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 2లక్షల 14వేల క్యూసెక్కులకు స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 24 క్రస్టు గేట్లను ఎత్తి లక్షా 65వేల 984 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో ఆరుయూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. విద్యుదుద్పత్తి నిమిత్తం 30వేల 878 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 390 క్యూసెక్కులు, కుడి కాలువకు 390 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం లక్షా 98వేల 437క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 8.896 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.