రాజీ మార్గం.. ఇరువర్గాలకు న్యాయం
మహబూబ్‌నగర్ క్రైం: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉంటున్నాయి. సకాలంలో న్యాయం పొందక.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. ఈనేపథ్యంలో లోక్ అదాలత్‌లో ఇరు వర్గాలను ఒకే వేదికపై హాజరుపర్చి న్యాయమూర్తుల సమక్షంలో సామరస్యంగా రాజీ పద్ధతిలో వారి సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. న్యాయసేవల గురించి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ఉచిత హెల్ప్‌లైన్ 15100ను సంప్రదించి సమస్యను చెప్పుకోవచ్చు. శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో ఆరు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు.
● ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే మండల, జిల్లాస్థాయిలో ఉన్న న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయించవచ్చు. ఏదైనా తగాదా ఏర్పడితే న్యాయస్థానంలో దావా దాఖలు చేయకంటే.. నేరుగా న్యాయసేవా అధికార సంస్థను ఆశ్రయిస్తే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా ఇరువర్గాల సమస్యను పరిష్కరించి వెంటనే తీర్పు చెబుతారు. న్యాయస్థానాల్లో దాఖలైన కేసులను కూడా లోక్ అదాలత్ పరిష్కరించుకోవచ్చు. కుటుంబకలహాలు, మనోవర్తి, గృహహింస, అన్ని రకాల సివిల్ దావాలు, నష్ట పరిహారం కోరుతూ మోటారు వాహనాల చట్టం కింద నమోదయ్యే కేసులు, బ్యాంకు రుణాలు, భూ తగదాలు రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్ కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది.
● చిన్నచిన్న గొడవలు, ఆస్తుల క్రయవిక్రయాలు, నగదు లావాదేవీలు, రోడ్డు ప్రమాదాలు, నష్టపరిహారాలు, కుటుంబ తగాదాలు, భార్యాభర్తల విషయంలో నమోదైన కేసులను లోక్ అదాలత్‌లలో రాజీ చేయొచ్చు. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, బాలికపై లైంగిక దాడులు, దొంగతనాలు, దోపిడీలు, ప్రత్యేక చట్టాలపై నమోదైన కేసులను లోక్ అదాలత్‌లో రాజీకి వీల్లేదు.
నేడు జాతీయ లోక్ అదాలత్
సమయం ఆదా.. ఆర్థికంగా లాభం
జిల్లాలో ఎనిమిది బెంచీలు ఏర్పాట్లు
రాజీ మార్గం.. ఇరువర్గాలకు న్యాయం


