చరిత్రలో నిలిచిపోయేలా సంబరాలు చేద్దాం
జడ్చర్ల టౌన్: బాదేపల్లి బాలుర జెడ్పీ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా చేసుకుందామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. హైస్కూల్ ప్రారంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థుల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్, మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ హైస్కూల్‌లో చదివిన పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోఆర్డినేషన్ కమిటీ తేదీ నిర్ణయిస్తే మూడు రోజుల ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గవర్నర్‌తో పాటు మంత్రులను ఆహ్వానించే బాధ్యత తీసుకుంటానన్నారు. వేడుకలకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు. అయితే శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చే రాష్ట్రపతిని ఆహ్వానించి, అదే సమయంలో వేడుకలు నిర్వహించాలని కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోరుతున్నారని, అందుకోసం ముఖ్యమంత్రి ద్వారా ప్రయత్నిద్దామని తెలిపారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను సైతం కలుసుకుని రాష్ట్రపతిని ఆహ్వానిద్దామన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు బి.రవిశంకర్, వి.కృష్ణ, రమణాచార్యులు, ఇబ్రహీం, వెంకటేశ్, పెద్దిబాలు, పరమటయ్య, శ్రీహరి, సంతోష్‌చారి, బాబర్, మార్కెట్ చైర్‌పర్సన్ జ్యోతి, వార్డుకౌన్సిలర్ రఘురాంగౌడ్, పట్టణ ప్రముఖులు బి.శివకుమార్, కె.లక్ష్మయ్య, ఎంఈఓ మంజులాదేవి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులను ఆహ్వానిద్దాం
బాదేపల్లి హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి


