
నకిలీ విత్తనాల నియంత్రణకు కఠిన చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నరగ్): ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు కఠినచర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ జానకితో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి తర్వాత పత్తి పంటనే ఎక్కువ సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాలు నిల్వ చేయడం, అమ్మడం, విత్తడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మడం నేరమన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. బీజీ–3 పత్తి విత్తనాల వలన భూసారం దెబ్బ తినడంతో పాటు వాతావరణం కలుషితం అవుతుందన్నారు. శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు 16 టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లాలోని 259 డీలర్ ఔట్‌లెట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ పోలీస్‌శాఖ తరఫున నకిలీ పత్తి విత్తనాలు నియంత్రణ చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని, ఎలాంటి సమాచారం ఉన్నా ముందుగా తెలిపితే పోలీస్‌శాఖ నుంచి తగిన సిబ్బందిని పంపిస్తామన్నారు. జిల్లాలో ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, డీఏఓ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
‘మత్తు’ వల్ల కలిగే అనర్థాలపై
అవగాహన కల్పించాలి
డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. కలెక్టరేట్‌లో డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం, రవాణాను యాంటీ డ్రగ్ కమిటీలు గుర్తించాలని సూచించారు. గంజాయి సాగు చేయకుండా ఎకై ్సజ్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్‌శాఖ మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, పాన్‌షాప్‌లపై దృష్టి పెట్టాలన్నారు. మత్తు పదార్థాల బారిన పడిన ఎంతమంది వైద్యం కోసం ఆస్పత్రులకు వచ్చారని ఆరా తీశారు. పాఠశాలలు, కళాశాలలు, మెడికల్ కాలేజీలు, పబ్లిక్ ఉండే ప్రాంతంలో మత్తు పదార్థాలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ, అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, సీఎంఓ బాలుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.