
హైవే నిర్మాణం.. వివాదం
జడ్చర్ల టౌన్: జాతీయ రహదారి–167 నిర్మాణ పనులు ఏ ముహూర్తాన ప్రారంభించారోగాని వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. పట్టణంలో మొదట ఫ్లై ఓవర్ వంతెన మంజూరు కాగా స్థానికుల ఆందోళనలతో నాలుగు వరసల రహదారిగా మార్చారు. ఇందులోనూ ప్రస్తుతం మరో వివాదం మొదలైంది. విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న అంబేడ్కర్ చౌరస్తా పూర్తిగా కనుమరుగుకానుంది. పాతబజార్‌కు వెళ్లాలంటే రైల్వే వంతెన దాటి కల్వకుర్తి రోడ్‌లో యూటర్న్ తీసుకుని వెళ్లాల్సిందే. ఈ విషయాన్ని స్వయంగా జాతీయ రహదారులశాఖ డీఈ సుమిత్‌కుమార్ వెల్లడించడంతో పాతబజార్ వాసుల్లో ఆందోళన మొదలైంది. పాతబజార్‌కు వెళ్లేందుకు సర్వీస్‌రోడ్డు నిర్మాణం చేస్తున్నప్పటికీ కేవలం కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు మాత్రమే పరిమితం కావడంతో ఆందోళన బాట పట్టనున్నారు. ఇందుకోసం శనివారం గౌడ ఫంక్షన్‌హాల్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. నెహ్రూ చౌరస్తాలో 100 మీటర్ల అతి పెద్ద సర్కిల్ నిర్మాణం చేపడుతున్న జాతీయ రహదారులశాఖ అంబేడ్కర్ సర్కిల్‌ను తొలగించడంపై స్థానికుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
చర్చించి నిర్ణయం తీసుకుంటాం..
అంబేడ్కర్ సర్కిల్‌ను తొలగించి పాతబజార్‌కు భారీ వాహనాల రాకపోకలు లేకుండా చేస్తున్న అంశంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అందుకే శనివారం సమావేశం నిర్వహిస్తున్నాం. సర్వీస్‌రోడ్డు నిర్మించినా అది కేవలం కార్లు, ఆటోలకే పరిమితం కావడం సరికాదు. ఇపుడున్నట్లుగానే పాతబజార్‌కు వాహనాల రాకపోకలు సాగించేలా ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తాం. అధికారుల తప్పిదంతో 20 వేల మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. – పి.మురళి, పాతబజార్
డిజైన్ మార్చాల్సిందే..
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పాతబజార్‌కు వాహనాలు వెళ్లకుండా చేయడం సరికాదు. ప్లానింగ్ సరిగా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డిజైన్ మార్చేలా చూస్తాం. రోడ్డు విస్తరణ జరగాల్సిందే కాని అందరికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడున్నట్లుగానే యధావిధిగా వాహనాలు పాతబజార్‌కు వెళ్లేలా చూడాల్సిందే. ఇందుకోసం అఖిలపక్షం వేస్తే పాతబజార్ వాసులందరు సహకరించాలి.
– వంశీచారి, పాతబజార్
ఆది నుంచి వివాదాలకు నెలవుగా మారిన ఎన్‌హెచ్–167 పనులు
జడ్చర్లలో కనుమరుగుకానున్న అంబేడ్కర్ సర్కిల్
సర్వీస్‌రోడ్డు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకే పరిమితం
భారీ వాహనాలు రాకపోకలు సాగించేది ఎలా?
వ్యతిరేకిస్తూ నేడు పాతబజార్‌వాసుల అఖిలపక్ష సమావేశం

హైవే నిర్మాణం.. వివాదం

హైవే నిర్మాణం.. వివాదం

హైవే నిర్మాణం.. వివాదం