
రేపు గ్రామ పాలన అధికారుల పరీక్ష
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పాలన అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డిప్యూటీ నోడల్ ఆఫీసర్, లైజన్ ఆఫీసర్, సీనియర్ మెసేంజర్, చీఫ్ సూపరింటెండెంట్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు, వివిధ శాఖల అధికారులతో పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 25న (ఆదివారం) ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల జిల్లాకేంద్రంలోని చైతన్యహైస్కూల్ (బస్‌స్టాండ్ పక్కన)గ్రామ పాలన అధికారుల పరీక్ష ఉంటుందని, 152 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారని, ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష ముగిసే వరకు బయటకు వెళ్లడానికి అనుమతి లేదని, అభ్యర్థులు ఇటీవల పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటో, పనిచేస్తున్న కార్యాలయ అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న ఫొటోపై సంబంధిత కార్యాలయ అధికారితో సంతకం చేయించుకోవాలన్నారు. పరీక్ష హాల్‌లోకి బాల్ పాయింట్ పెన్నులు (బ్లూ/బ్లాక్), హాల్‌టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, ప్రధానంగా ఆధార్ మాత్రమే తీసుకెళ్లాలని, ఇతర రంగుల పెన్నులు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించమని పేర్కొన్నారు. మే 25న కలెక్టరేట్‌లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్‌లైన్ నంబర్ 08542 241165 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ నవీన్, నగర పాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ కృష్ణ పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు