
నిషేధిత బీజీ–3 పత్తి విత్తనాల పట్టివేత
జడ్చర్ల: ప్రభుత్వం నిషేధించిన బీజీ–3 పత్తి విత్తనాలను జిల్లా వ్యవసాయ శాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్, సీఐ కమలాకర్‌లు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెళ్లడించారు. మండలంలోని గోప్లాపూర్‌లో గుట్టుగా లూజ్ పత్తి విత్తనాలను గుంటూరు, మాచర్ల ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని రైతులకు విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా అధికారులకు విషయాన్ని చేరవేశారు. దీంతో వ్యవసాయ శాఖ జడ్చర్ల పోలీసులను అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయాన్నే వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా 8 టాస్క్‌ఫోర్స్ బృందాలు గోప్లాపూర్ గ్రామానికి చేరుకుని అనుమానం ఉన్న పలువురు రైతుల ఇళ్లను ఏకకాలంలో సోదా చేశారు. తనిఖీలో రైతు మధుసూదన్‌రెడ్డి దగ్గర ప్లాస్టిక్ కవర్లలో కిలో చొప్పన ప్యాక్ చేసిన లూజ్ బీజీ–3 పత్తి విత్తనాలు దొరికాయి. మొత్తం 30 ప్యాకెట్లను రైతు నుంచి స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకుని జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న పత్తి విత్తనాలను ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించగా బీజీ–3 విత్తనాలుగా నిర్దారించారు. అయితే ఆయా విత్తనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించి పరీక్షిస్తామని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పత్తి విత్తనాల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఈ సందర్బంగా వారు తెలిపారు. నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే నకిలీ విత్తనాలను అంటగట్టే వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో నకిలీ విత్తనాల కేసులలో ఉన్న నిందితులను కూడా బైండోవర్ చేస్తామన్నారు. కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీ చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ లైసెన్స్‌లు ఉన్న దుకాణాలలోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని కోరారు. పంట నష్టం జరిగిన సమయంలో పంటల బీమా, తదితర పరిహారం కోసం బిల్లులు ఉపయోగపడుతాయన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తమ సిబ్బంది రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ, పోలీసుల దాడులు
గోప్లాపూర్‌లో గుట్టుగా పత్తి విత్తనాల నిల్వలు
నిందితుడిపై కేసు నమోదు