
పాలమూరుకు రెండో విజయం
మహబూబ్‌నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ర్ట్ టూడే లీగ్ అండర్–23లో పాలమూరు జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. జిల్లాకేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో శుక్రవారం గద్వాల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాలమూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల జట్టు పాలమూరు బౌలర్ల ధాటికి 25.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో రాహుల్‌యాదవ్ 53 పరుగులు చేశాడు. పాలమూరు బౌలర్ ఎండీ ముఖీతుద్దీన్ 7 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మరో బౌలర్ కొండ శ్రీకాంత్ 9.2 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాలమూరు జట్టు 21 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. జట్టులో డేవిడ్ క్రిపాల్ 44, మహ్మద్ షాదాబ్ 22 పరుగులు చేశారు.
జిల్లాకు పేరు, ప్రతిష్టలు తేవాలి
క్రికెట్‌లో క్రీడాకారులు ప్రతిభచాటి జిల్లాకు పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ అన్నారు. అండర్–23 లీగ్ మ్యాచ్ సందర్భంగా ఆయన మహబూబ్‌నగర్, గద్వాల జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఎంతోమంది జిల్లా క్రీడాకారులు క్రికెట్‌లో రాణిస్తుండడం అభినందనీయమన్నారు. అండర్–23 లీగ్‌లో ప్రతిభచాటాలని కోరారు. భవిష్యత్‌లో జిల్లా క్రీడాకారులు రంజీ, భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, వెంకటరామారావు, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గద్వాలపై ఆరు వికెట్ల తేడాతో గెలుపు