
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఎర్రవల్లి: చికిత్స పొందుతున్న ఓ యువకుడు శుక్రవారం మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి కథనం మేరకు.. ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామానికి చెందిన బోయ శివకుమార్ (21)ను బాగా చదువుకోవాలని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపానికి గురయ్యాడు. గురువారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా శాంతినగర్‌కు వెళ్లి మద్యం సీసాలో గడ్డిమందు కలుపుకొని తాగి తిరిగి ఇంటికొచ్చి పడుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. చేతికొచ్చిన కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
వెల్దండ: మండలంలోని చెర్కూర్ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని కారు ఆటోని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన చవ్వ మల్లేష్, మంజుల దంపతులు నలుగురు పిల్లలతో కలిసి తమ ఆటోలో కల్వకుర్తికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో చెర్కూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మల్లేష్ కాళ్లకు గాయాలయ్యాయి. మంజులకు రెండు కాళ్లు విరగడంతో పాటు నడుముకు, తలకు గాయలయ్యాయి. నలుగురు పిల్లలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికులు గుర్తించి వారిని చికిత్స నిమిత్తం వెల్దండలోని యెన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.
ఆరుగురికి గాయాలు