
మహిళ హత్యకేసులో నిందితుడు అరెస్టు
నాగర్‌కర్నూల్ క్రైం: మద్యం మత్తులో మహిళపై లైంగిక దాడి చేసి హత్యచేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. ఫిబ్రవరి 12న జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వెనుక గేటు వద్ద జరిగిన హత్యకేసుకు సంబంధించి సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడ గ్రామానికి చెందిన కావలి శాంతమ్మ యాచకురాలిగా జీవనం సాగిస్తోంది. ఈమె ఫిబ్రవరి 12న జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వెనుక గేటు వద్ద హత్యకు గురైంది. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా హత్య సంఘటనా స్థలంలో సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించారు. హత్యకు పాల్పడిన వ్యక్తి చెత్తకాగితాలు ఏరుకుని జీవనం సాగించే తాడూరు మండలం పాపగల్ గ్రామానికి చెందిన గోవింద్‌రాములుగా గుర్తించారు. నిందితుడి కోసం మూడునెలలుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం నిందితుడు తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లి గ్రామానికి వచ్చాడనే సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడి భార్య పదేళ్ల క్రితమే అతడికి దూరంగా ఉండటంతో మహిళలపై కోపం పెంచుకుని సైకోగా ప్రవర్తించే వాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ గోవర్ధన్, పోలీసు సిబ్బంది ఉన్నారు.