
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన వాటిని నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకంపై నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు మొదటి విడతలో 1,244 ఇందిరమ్మ ఇళ్లు కాగా.. 541 ఇళ్లకు మార్క్ అవుట్ చేశారని, 134 బేస్మెంట్, 7 రూఫ్ లెవెల్‌లో ఉన్నాయని, 73 మందికి బిల్లులు నిర్మాణ దశను అనుసరించి విడుదల చేసినట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు వివరించారు. రెండో విడతలో 7,044 మంజూరు కాగా.. 3,796 ప్రొసీడింగ్స్ జనరేట్ చేసినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడత మంజూరు చేసిన ప్రొసీడింగ్స్ ప్రజాప్రతినిధులచే పంపిణీ చేయాలని సూచించారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేసినా నిర్మాణాలు మొదలుపెట్టని వారిని గుర్తించి వెంటనే పనులు చేపట్టేలా, ఇంటి నిర్మాణం కోసం మహిళా సంఘాల ద్వారా రుణం మంజూరు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీఓల ఆధ్వర్యంలో గృహ నిర్మాణ ఏఈలు, పంచాయతీ కార్యదర్శి, మేసీ్త్రలు, లబ్ధిదారులతో గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దార్, లేబర్ అధికారి, గృహ నిర్మాణ ఏఈలతో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీలు భాగస్వామ్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షలతో ఇళ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. రాజీవ్ వికాస పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహలు, గృహ నిర్మాణ శాఖ పీడీ భాస్కర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.