
ఘనంగా షా అలీ పహిల్వాన్ ఉర్సు
అలంపూర్ : అలంపూర్‌లో వెలిసిన షా అలీ పహిల్వాన్ ఉర్సు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో గంధోత్సవం నిర్వహించారు. ఉత్సవాల రెండో రోజు బుధవారం సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ పోటీలు జరిగాయి. గుల్బార్గా నుంచి గంధం తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన గంధంను మత పెద్దలు సుగంధ ద్రవ్యాలు కలిపి సిద్ధం చేశారు. అనంతరం మేళతాళాల మధ్య సయ్యద్ ఖాదర్ బాష ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి గంధం తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల అనంతరం సర్ ముబారక్ దర్గా తర్వాత దడ్ ముబారక్ దర్గాకు తీసుకెళ్లి గంధోత్సవ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం చిన్న కిస్తీ పోటీలు జరిగాయి. యువకులు వివిధ రకాల విన్యాసాలను చేస్తూ కిస్తీ పోటీల్లో పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్గాలో మొక్కులు చెల్లించి ప్రార్థనలు జరిపించారు. మొక్కులు తీర్చుకునే క్రమంలో కిస్తీలో పలావ్, మిఠాయిలు వేయగా యువకులు పోటీ పడి వాటిని భక్తులపైకి విసిరారు. ఈ క్రమంలో పోటికి దిగిన పహిల్వాన్‌లు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
నేడు పెద్ద కిస్తీలు
షా అలీ పహిల్వాన్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు దడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీ పోటీలు గురువారం జరగనున్నాయి. పెద్ద కిస్తీ పోటీలను తిలకించడానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో గంధోత్సవం
నేడు పెద్ద కిస్తీ పోటీల నిర్వహణ

ఘనంగా షా అలీ పహిల్వాన్ ఉర్సు