
దివ్యాంగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
మహబూబ్‌నగర్ రూరల్: దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ 10లోపు మార్చాలని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.మధుబాబు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 43.02 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48 లక్షల మంది ఉంటే కేవలం 4,90,044 మందికే పెన్షన్లు వస్తున్నాయన్నారు. 2016 ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం, 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
వేధింపులపై చర్యలేవి..
మహిళా దివ్యాంగులపై అత్యాచారాలు, లైగింక వేధింపులు, దివ్యాంగులపై దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. వైకల్యం కలిగిన విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యాసంస్థలు లేకపోవడం వల్ల వారు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని వాపోయారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహం రూ. 2 లక్షలకు పెంచడంతో పాటు జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశప్ప, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలేశ్వర్, నాయకులు నర్సిములు, రాధమ్మ, భాగ్యలక్ష్మి, కుర్మయ్య, మంగమ్మ, భానుప్రకాష్, తిరుపతయ్య, సురేష్, బాబు, బసప్ప తదితరులు పాల్గొన్నారు.