సత్వర న్యాయం అందేలా చూడాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిర్యాదులు చేసే బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా పలువురు బాధితులు సమస్యలపై ఎస్పీ ఫిర్యాదులు అందించారు. ఆ తర్వాత ఆయా పోలీస్‌స్టేషన్‌లకు సంబంధించిన ఎస్‌ఐలు, సీఐలతో ఎస్పీ ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల భద్రత, న్యాయం, నమ్మకాన్ని పెంపొందించేందుకు పోలీస్‌శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలు నమ్మకంతో ముందుకు రావాలని సూచించారు. బాధితులకు న్యాయం ఆలస్యం అవుతున్నా.. సమస్యలు ఎదురవుతున్నా వెంటనే జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ట్రాన్స్‌కో అధికారులఫోన్ నంబర్లు మారాయి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ ఫోన్ నంబర్ల స్థానంలో కొత్తవాటిని కేటాయించారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ) 87124 72097, డీఈ 87124 72155, టౌన్ ఏడీ 87124 72156, టౌన్–1 ఏఈ 87124 72160, టౌన్ –1 ఫ్యూస్ ఆఫ్ 87124 72215, టౌన్–2 ఏఈ 8712472161, ఫ్యూస్ ఆఫ్ 8712472219, టౌన్–3 ఏఈ 8712472162, ఫ్యూస్ ఆఫ్ 87124 72221 కేటాయించారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.
ముగ్గురు డీఎస్పీల బదిలీ
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు డీఎస్పీలను బదిలీ చేయడంతోపాటు ఒకరికి పోస్టింగ్ ఇస్తూ సోమవారం పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో డీసీఆర్‌బీ డీఎస్పీగా పనిచేస్తున్న సుదర్శన్‌ను హైదరాబాద్ గోషామహల్ ఏసీపీగా, సీసీఎస్ డీఎస్పీగా ఉన్న లక్ష్మీనారాయణను షాద్‌నగర్ ఏసీపీగా బదిలీ చేయడం జరిగింది. అలాగే గాంధీనగర్ ఏసీపీగా పనిచేస్తున్న వై.మొగిలయ్యను గద్వాల డీఎస్పీగా బదిలీ చేయగా.. గద్వాల డీసీఆర్‌బీ డీఎస్పీగా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డిని కుషాహిగూడ ఏసీపీగా బదిలీ చేశారు.
ప్రశాంతంగా
కొనసాగుతున్న పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీసీ శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, వాసవీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థి వెళ్లే క్రమంలో తప్పకుండా హాల్‌టికెట్‌తో పాటు ఒక గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సెమిస్టర్–4కు సంబంధించి మొత్తం 8,142 మంది విద్యార్థులకు 7,859 మంది విద్యార్థులు హాజరై 283 గైర్హాజరయ్యారు. సెమిస్టర్–5కు సంబంధించి 467 మంది విద్యార్థులు 435 మంది హాజరై 32 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆముదాలు @ రూ.5,906
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన ఈ టెండర్లలో ఆముదాలు క్వింటాల్ సరాసరిగా రూ.5,906 ఒకే ధర లభించింది. సీజన్ లేకపోవడంతోపాటు చాలామంది రైతులు ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయిస్తుండటంతో మార్కెట్‌కు అమ్మకానికి ధాన్యం రాలేదు.
సత్వర న్యాయం అందేలా చూడాలి: ఎస్పీ


