దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగరాల గ్రామంలోని పెద్దగుట్టపై తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు జరిపిన అన్వేషణలో 11వ శతాబ్దానికి చెందిన కొత్త రాతి చిత్రాలు వెలుగు చూశాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ కొత్త చరిత్ర బృందం సభ్యులు కావలి చంద్రకాంత్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జీనుగరాల పెద్దగుట్టపై జరిపిన అన్వేషణలో రాతిపై ఎర్రటి రంగులో చిత్రించిన చిత్రాలు బయటపడ్డాయి. ఇందులో కింది నుంచి పైకి ఒక రథంలా కనిపించే ఎరుపు గీతలలో మనిషి ఆకారం చతురస్రాకారంలో కనిపిస్తుంది. అలాగే తాబేలు, పక్కన నిచ్చెన వంటి నిలువు గీతలు ఉన్నాయి.
వాటి చిత్రాలను తీసి చరిత్ర బృందం రాతి చిత్రాల నిపుణులు మురళీధర్‌రెడ్డి, కొత్త చిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్‌కు పంపించారు. వారు వీటిని పరిశీలించి చారిత్రక కాలానికి మధ్యయుగం నాటి రాతి చిత్రాలుగా గుర్తించారని చంద్రకాంత్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. బొమ్మ లోపల బొమ్మల వలె ఒక మనిషి నిలువ బొమ్మలో ఇవన్నీ గీసినట్లు కనిపిస్తుంది. ఇవి ప్రత్యేకంగా స్థానిక ప్రజలలో ఒకవర్గం వారి పూజాస్థానం అనిపిస్తుంది. ఈ రాతి చిత్రాల పరిసరాల్లో పురాతన మానవుల సమాధులు, ఆవాసాల జాడలున్నాయి. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అన్వేషిస్తే మరిన్ని చరిత్ర పూర్వయుగ సంస్కృతులు తెలిసే అవకాశం ఉందని చంద్రకాంత్ తెలిపారు.
జీనుగరాల పెద్దగుట్టపై.. మధ్యయుగం నాటి రాతి చిత్రాలు


