
తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులతో మండలాల వారీగా తాగునీటి సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైపులైన్ లీకేజీలు, డ్యామేజ్‌లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. సీసీ కుంట మండలంలో 13 హ్యాబిటేషన్‌లలో వనపర్తి జిల్లా రామనపాడు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ లీకేజీ, తదితర కారణంగా గ్రిడ్ వాటర్ తక్కువగా వస్తుందని కలెక్టర్ దృష్టికి రాగా.. నీటి సరఫరా మెరుగుపరచాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అడ్డాకుల మండలంలో బలీద్‌పల్లి, కన్ననూర్‌లో వనపర్తి వాటర్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్ ద్వారా మే 15 లోగా తాగునీటి సరఫరా మెరుగుపర్చాలన్నారు. మిషన్ భగీరథ ఓవర్‌హెడ్ ట్యాంకులు, గేట్‌వాల్స్, పాత మోటార్లు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తిచేయాలన్నారు. ప్రతి ఇంటికి నీటి కొరత లేకుండా నీరు అందేలా చూడాలని, మోటార్లు మరమ్మతులు ఉన్న చోట నీటి కొరత లేకుండా ట్యాంకర్లు, బోర్‌వెల్ బావులు వంటివి ఏర్పాట్లు చేయాలన్నారు. ఏమైనా ప్రతిపాదనలు ఉంటే పంపించాలని వెంటనే మంజూరు చేస్తామన్నారు. ప్రత్యేకాధికారులు రోజు వారి విధులతో పాటు ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీపీఓ పార్థసారథి, డీఆర్‌డీఓ నర్సింహులు, మిషన్ భగీరథ గ్రిడ్ ఇన్‌చార్జి ఈఈ శ్రీనివాస్, ఇంట్రా ఈఈ పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయేందిర బోయి