
వరిధాన్యం కొనుగోలులో కొర్రీలు
అడ్డాకుల/నర్వ/వీపనగండ్ల/దామరగిద్ద: ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు అన్నదాతలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు కొర్రీలు పెడుతూ.. ధాన్యం సేకరణ ప్రక్రియను నత్తనడకన సాగిస్తుండటంతో రైతన్నల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
● అడ్డాకుల మండలంలోని పొన్నకల్‌లో ధాన్యం త్వరగా సేకరించడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి రాచాల – మహబూబ్‌నగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం తలకు మించిన భారంగా మారిందని వాపోయారు. రోజుకు ఒక లారీ వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని.. చాలా మంది రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోని పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఎం. శ్రీనివాస్ పొన్నకల్‌కు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. తహసీల్దార్ శేఖర్ ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడి.. వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేస్తామని, అవసరమైతే ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
● నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద రైతులు ధాన్యం వాహనాలను రహదారికి అడ్డుగా పెట్టి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మూడు, నాలుగు రోజులుగా ధాన్యం వాహనాలతో పడిగాపులు కాస్తున్నా మిల్లర్లు దించుకోవడం లేదని వాపోయారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
● వీపనగండ్ల మండలం తూంకుంటలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యంలో తాలు పేరుతో 40 కిలోలకు అదనంగా 5 కిలోలు వేస్తేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని నిర్వాహకులు అంటున్నారని రైతులు వాపోయారు. అధికారులు మిల్లర్లతో కుమ్మకై ్క రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఏపీఎం బిచ్చన్నను వివరణ కోరగా.. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యంలో అధిక శాతం తాలు ఉందని, తూర్పు పట్టి తాలును తొలగిస్తే కొనుగోలు చేస్తామని చెప్పామని వివరణ ఇచ్చారు.
● దామరగిద్ద మండలం కాన్‌కుర్తి సమీపంలోని గుర్మిటకల్–కొడంగల్ ప్రధాన రహదారిపై ధాన్యం వాహనాలతో రైతులు ఆందోళనకు దిగారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మిల్లర్లు తమకు ప్రభుత్వ గిడ్డంగులు కేటాయిస్తే ధాన్యం కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటామని చెప్పడంతో అధికారులు గిడ్డంగులు ఇచ్చేందుకు అనుమతించారు. కాగా, గిడ్డంగి వద్ద వేబ్రిడ్జి లేకపోవడంతో సమీపంలోని కాటన్‌మిల్, కాన్‌కుర్తి, విఠలాపూర్ రైస్ మిల్లుల్లోని వే బ్రిడ్జ్‌ల్లో తూకం వేయించాలని అధికారులు నిర్ణయించారు. తీరా సదరు మిల్లర్లు వే బ్రిడ్జిలను ఇచ్చేందుకు ఇష్టంలేక పనిచేయడం లేదని చేతులెత్తేశారు. దీంతో రెండు రోజులుగా 164కి పైగా ధాన్యం వాహనాలు వేయింగ్ కోసం బారులు తీరాయి. దీన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగగా.. సీపీఎం నాయకులు మద్దతుగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న డీఎస్‌ఓ బాల్‌రాజ్, సివిల్ సప్‌లై డీఎం సైదులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
రోడ్డెక్కి ఆందోళనకు దిగిన అన్నదాతలు
సకాలంలో ధాన్యం సేకరించడం లేదని ఆవేదన

వరిధాన్యం కొనుగోలులో కొర్రీలు

వరిధాన్యం కొనుగోలులో కొర్రీలు