
ఖనిజ సంపద దోపిడీకే ఆపరేషన్ కగార్
సమసమాజ
నిర్మాణమే ధ్యేయం
దోపిడీ వ్యవస్థల నిర్మూలన, సమసమాజం నిర్మాణం కోసం కమ్యూనిస్టులు పోరాటం చేశారని అలాంటి వ్యక్తుల్లో కందికొండ రామస్వామి ఒకరు అని వక్తలు అభిప్రాయపడ్డారు. నాగర్‌కర్నూల్‌లోని సింగిల్ విండో హాల్‌లో ఆదివారం నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో బల్కాన్ బ్యాక్ ప్యాక్ కథలు పుస్తక రచయిత శ్రీఊహకు కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజలను సంఘటితం చేసిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అని, ఈ పోరాటానికి ప్రపంచ గుర్తింపు ఉందన్నారు. బాంచన్ కాల్మొక్త దొర అన్న నినాదానికి వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టి పోరాడారన్నారు. అలాంటి విలువ కలిగిన వ్యక్తుల పేర్ల మీద పురస్కారాలు అందించడం ఆనందంగా ఉందన్నారు.
నాగర్‌కర్నూల్ రూరల్/ కల్వకుర్తి రూరల్: దేశంలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు పంచిపెట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెబుతున్నా.. బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని హతమార్చేందుకు కుట్ర పన్నుతుందన్నారు. కర్రెగుట్ట చుట్టూ కేంద్ర బలగాలను దింపి మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసీలను పొట్టన పెట్టుకుంటుందన్నారు. ఇప్పటికే 400 మందికిపైగా ఆదివాసీలను చంపేశారని ఆరోపించారు. అలాగే కులగణన చేపడతామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. నిర్దిష్ట సమయం చెప్పకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో ఎప్పటిలోగా సర్వేను పూర్తిచేస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిశ్రమల పెట్టుబడిదారులకు అప్పగించేందుకే చట్ట సవరణ చేసిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. ఈ నెల 7నుంచి హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ అందాల పోటీల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. అందాల పోటీలతో పాశ్చాత్య సంస్కృతి రాజ్యమేలుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు సీపీఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి కల్వకుర్తికి వచ్చిన ఆయనను ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం పాలమూరు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి జాన్‌వెస్లీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలోసీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యుడు ఆంజనేయులు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పరశురాములు, మల్లయ్య, శివరాములు, బాలస్వామి, శ్రీనివాసరావు, దేశానాయక్, గీత, ఆంజనేయులు, అశోక్, శ్రీనివాసులు, ఈశ్వర్, నర్సింహ, శివవర్మ, మధు, కాశన్న, శివరాం, సురేశ్, కుర్మయ్య, నాగరాజ్‌గౌడ్, రవి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిర్దిష్ట సమయం లేని కులగణన
గ్యారంటీల అమలులో
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ