కొత్తకోట రూరల్: రైతులు తేనెటీగల పెంపకాన్ని అదనపు ఆదాయపు ఆదాయంగా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా చేపట్టవచ్చని మోజర్ల ఉద్యానవన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగెం సైదయ్య అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయ పరిధిలోని ఉద్యానవన కళాశాల వేదికగా జిల్లాస్థాయి తేనెటీగల పెంపకంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధన స్థానం ఆధ్వర్యంలో ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిడిగెం సైదయ్య మాట్లాడుతూ భారతదేశంలో లభించే తేనె అత్యంత శ్రేష్టమైనదని, పోషక విలువలతోపాటు ఔషధ గుణాలు ఉండటం వల్ల ఎగుమతికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. తేనెటీగలు పెంపకం వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఎదిగితే రైతులకు అదనపు ఆదాయం కచ్చితంగా లభిస్తుందన్నారు. వ్యవసాయానికి, పర్యావరణానికి, మానవ సమాజానికి ఎక్కువగా ఉపయోగపడి ఏకై క పరిశ్రమగా తేనెటీగల పెంపకం పేరు పొందిందని గుర్తుచేశారు. భవిష్యత్‌లో సాధించబోయే తీపి విప్లవానికి ప్రధాన భూమిక తేనెటీగల పెంపకం అన్నారు. అనేక బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయని, లోన్లు సైతం ఏర్పాటు ఇస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదనపు ఆదాయం పొందాలని సూచించారు. కేవలం కుటుంబ సభ్యులతోనే తక్కువ పెట్టుబడితో ఏడాదంతా ఉపాధి తేనెటీగలు పెంపకంతో లభిస్తుందన్నారు. తేనెకు ఎంతకాలమైనా నిల్వ ఉంటుందని, అందువల్ల నష్టాలు ఎట్టి పరిస్థితుల్లో రావని చెప్పారు. ఇప్పటికే తేనెటీగల పెంపకంలో అనుభవం పొందిన రైతులు, పరిశ్రమల దగ్గర రైతులకు శిక్షణ ఇప్పిస్తామని శాస్త్రవేత్త నిఖిల్ అన్నారు. ప్రధాన శిక్షణదారులు, అసోసియేట్ ప్రొఫెసర్ షహనాజ్ మాట్లాడుతూ ఆరు రోజుల శిక్షణలో తేనెటీగల జాతులు, శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకం, తేనె పట్టు నిర్వహణ, తేనె తీసే విధానం, తేనెటీగల పెంపకం ద్వారా లభ్యమయ్యే ఉత్పత్తులు, మార్కెటింగ్ మెలకువల గురించి శిక్షణ ఇచ్చామన్నారు.