ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌

Mar 20 2025 1:11 AM | Updated on Mar 20 2025 1:08 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యరంగాలతో పాటు ఆర్థికంగా వెనుకబడి కులాలను ఆదుకోవడానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసినట్లు చెప్పారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా బడ్జెట్‌ ఉందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాస్తవాలకు దూరంగా, అమలు కాని హామీలు ఇచ్చి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసిందని ఆరోపించారు. ఈ బడ్జెట్‌పై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రైతుభరోసాపై బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. రైతుబిడ్డ సీఎంగా ఉన్నారని, అందువల్ల రైతుల సంక్షేమం కోసం రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రూ.6వేల కోట్లు, ఈడబ్ల్యూఎస్‌కు రూ.1000కోట్లతో సబ్సిడీ రుణం అందించనున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్‌ ప్రసంగంలో కురుమూర్తి క్షేత్రం గురించి ప్రస్తావించడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, సీజే బెనహర్‌, గోవర్ధన్‌రెడ్డి, రాములుయాదవ్‌, అవేజ్‌ అహ్మద్‌, సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement