ఇంటికి నిప్పంటుకొని మహిళ సజీవ దహనం | - | Sakshi
Sakshi News home page

ఇంటికి నిప్పంటుకొని మహిళ సజీవ దహనం

Mar 19 2025 12:31 AM | Updated on Mar 19 2025 12:30 AM

బిజినేపల్లి: ఇంటికి నిప్పంటుకొని ఓ మహిళ సజీవ దహనమైన ఘటన మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మమ్మ (48) ఇంట్లో ఉండగానే నిప్పంటుకుని భారీగా పొగలు వస్తుండటంతో చుట్టుపక్కల వారు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మమ్మ కాలిన శరీరంతో చనిపోయి కనిపించింది. కుటుంబసభ్యులు కూడా వెంటనే ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోని ఒక గదిలో ఫర్నీచర్‌, ఇతర సామగ్రి కాలిపోయి ఉన్నాయి. మహిళ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

చెరువులో పడివృద్ధురాలు మృతి

లింగాల: మండలంలోని శాయిన్‌పేట సమీపంలో ఉన్న నర్సింహస్వామి చెరువులో పడి కుమ్మరి మధునాగుల బిచ్చమ్మ(65) అనే వృద్దురాలు మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు..వృద్ధురాలు బట్టలు ఉతుక్కోవడానికి చెరువు దగ్గరకు వెళ్లింది. ఇదే క్రమంలో కాలుజారి చెరువులో పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులో తెలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు గుర్తించారు. మృతురాలి భర్త లక్ష్మయ్య ఇదివరకే మృతిచెందగా ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ..

కోస్గి రూరల్‌: పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్‌ తెలిపారు. గుండుమాల్‌ మండలంలోని భక్తిమళ్ల గ్రామానికి చెందిన పిట్టల రవితో బొంరాస్‌పేట మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన మంగమ్మతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కూమారుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సోమవారం మరోమారు గొడవపడి మనస్తాపానికి గురైన పిట్టల మంగమ్మ (32 ) వ్యవసాయ పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఇంటికొచ్చింది. వాంతులు కావడంతో కుటుంబసభ్యులు కోస్గి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాలమూరు నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కోలుకోలేక మంగళవారం మధ్యాహ్నం మృతిచెందింది. మృతురాలి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

తండ్రి మందలించాడని..

నాగర్‌కర్నూల్‌ క్రైం: చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్దన్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలిక ఫోన్‌ చూస్తుండగా తండ్రి మందలించడంతో ఈనెల 15న ఇంట్లో పురుగు మందు సేవించింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జనరల్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పోక్సో కేసులో జీవిత ఖైదు

మహబూబ్‌నగర్‌ క్రైం: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 2020 డిసెంబర్‌ 21 కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దుప్పుల ఆనంద్‌ 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కోయిలకొండ ఎస్‌ఐ సురేష్‌గౌడ్‌ క్రైం నంబర్‌ 138లో ఐపీసీ 376(3) సెక్షన్‌5(ఐ) పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. అప్పటి రూరల్‌ సీఐ కేసు పర్యవేక్షించి చార్జ్‌షీట్‌ను దాఖలు చేయగా మంగళవారం కేసు కోర్టుకు రావడంతో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాలస్వామి 11 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి టి.రాజేశ్వరి నిందితుడు ఆనంద్‌కు జీవితఖైదుతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల పరిహారం మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.జానకి నిందితుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో పాటు పోలీస్‌ సిబ్బందిని అభినందించారు.

ఇంటికి నిప్పంటుకొని మహిళ సజీవ దహనం 
1
1/1

ఇంటికి నిప్పంటుకొని మహిళ సజీవ దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement