కడావర్‌ డాగ్స్‌తో అన్వేషణ | - | Sakshi
Sakshi News home page

కడావర్‌ డాగ్స్‌తో అన్వేషణ

Mar 19 2025 12:31 AM | Updated on Mar 19 2025 12:30 AM

అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. గల్లంతైన కార్మికుల జాడ కోసం మూడురోజులుగా కడావర్స్‌ డాగ్స్‌తో గాలింపు చేపడుతున్నా.. భారీగా ఉబికి వస్తున్న నీటి ఊట ఆటంకంగా మారుతున్నట్లు అధికారులు వివరించారు. డాగ్స్‌ చూపిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టినా మంగళవారం వరకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా.. ఇప్పటి వరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన వారి ఆచూకీ కోసం డి–1, డి–2 ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. 13.5 కి.మీ. నుంచి సొరంగం చివరి పాయింట్‌ వరకు 40 మీటర్ల దూరం అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోబోలతో సహాయక చర్యలు ఇంకా ప్రారంభం కాలేదు. వాటి ఇన్‌స్టాలేషన్‌ ప్రక్రియతో పాటు సిగ్నలింగ్‌ను మెరుగుపర్చేందుకు టెక్నీషియన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. జియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) అధికారులు టన్నెల్‌ ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించి విశ్లేషిస్తున్నారు. సింగరేణి, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌, కాడవర్స్‌ డాగ్స్‌, హైడ్రా, అన్వి రోబోటిక్స్‌, దక్షిణ మధ్య రైల్వే, జీఎస్‌ఐ, జలవనరుల వంటి 12 బృందాలు ఒక్కటిగా పనిచేస్తున్నాయి.

సమన్వయంతో ముందుకు..

సహాయక బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేరళకు చెందిన కడావర్‌ డాగ్స్‌ టన్నెల్‌లోకి వెళ్లాయిన.. టీబీఎం ప్లాట్‌ఫామ్‌ను ప్లాస్మా కట్టర్‌తో తొలగించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని, టీబీఎంపై ఉన్న మట్టిని సమాంతరంగా తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని, కట్‌ చేసిన విడి భాగాలను ఎస్కలేటర్‌ ద్వారా తొలగించి లోకో ట్రైన్‌లో బయటకు పంపిస్తున్నామని, మట్టిని కన్వేయర్‌ బెల్టు ద్వారా తరలిస్తున్నట్లు వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డ్రిల్లింగ్‌ మిషన్లు, సెన్సార్లు, రోబోటిక్‌ పరికరాలు వంటి సాధనాలను వినియోగించి సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.

ఆటంకంగా మారినటీబీఎం శకలాలు..

నీటి ఊట, బురద మట్టి, టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) శకలాలు సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. డి–1, డి–2 ప్రదేశాల్లో కాడవర్‌ డాగ్స్‌ చూపిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతుండగా టీబీఎం శకలాలు అడ్డుగా వస్తున్నాయని, దీంతో పనులు ముందుకు సాగడం లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్లాస్మా కట్టర్లతో టీబీఎం శకలాలను తొలగిస్తుండగా.. రెస్క్యూ బృందాలు తీసిన మట్టిని కన్వేయర్‌ బెల్టు ద్వారా బయటికి పంపడంలో ఆలస్యమవుతుంది. లోకో ట్రైన్‌ ద్వారా మట్టి, టీబీఎం శకలాలు బయటకు తరలిస్తున్నారు.

25 రోజులైనా దొరకని కార్మికుల ఆచూకీ

ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు

అందుబాటులోకి రాని రోబో సేవలు

కడావర్‌ డాగ్స్‌తో అన్వేషణ 1
1/1

కడావర్‌ డాగ్స్‌తో అన్వేషణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement