బ్యాటరీ, సెల్‌ టెక్నాలజీపై పరిశోధన | - | Sakshi
Sakshi News home page

బ్యాటరీ, సెల్‌ టెక్నాలజీపై పరిశోధన

Mar 9 2025 12:37 AM | Updated on Mar 9 2025 12:38 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ప్రస్తుతం బ్యాటరీ, సెల్‌ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్‌ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్‌, లోహం మెటీరియల్స్‌, ఎస్సెల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పా రు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల, కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అన్ని రకాలుగా అండగా ఉంటాం:

మంత్రి శ్రీధర్‌బాబు

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ డి.శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల దావోస్‌ సమ్మిట్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ పెద్ద సంస్థలు సుమారు రూ.78 వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ) కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. పరిశ్రమలను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద పరిశ్రమలు రావడానికి గ్రీన్‌ ఎనర్జీ పాలసీ అమలు చేస్తున్నామన్నారు. అమరరాజా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ, చైర్మన్‌ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, టీజీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డి.మహేశ్వర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్‌

సెమీ కండక్టర్స్‌ అభివృద్ధికి సహకరించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

దివిటిపల్లిలో 4 పరిశ్రమలకు శంకుస్థాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement