అలంపూర్: ఐదో శక్తిపీఠం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో శనివారం ఆరుద్రోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చక స్వాములు గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రదక్షిణలు, దర్భార్ సేవలు నిర్వహించారు. ఆలయంలోని రససిద్ధి గణపతికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు విశేషంగా జరిగాయి. అనంతరం బాలబ్రహ్మేశ్వరస్వామిని పండ్ల రసాలు, పంచామృతాలు, మంగళద్రవ్యాలతో అభిషేకించారు. అన్నసూక్త పఠనంతో స్వామివారికి స్వేతాన్నంతో అభిషేకాలు జరిగాయి. అన్నాన్ని లింగాకృతిలో అలంకరించి.. బిల్వదళాలు, వివిధ రకాల పూలతో అష్టోత్తర అర్చనలు, పంచభక్ష పరమాన్నాలతో మహా నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారి నామాన్ని స్మరిస్తూ అభిషేకాలు చేశారు. అదే విధంగా ఏక హారతి, నేత్ర హారతి, బిల్వ హారతి, వేద హారతి, కర్పూర పంచక హారతి, రథ హారతి, చక్ర హారతి, కుంభ హారతి, నక్షత్ర హారతులతో శతవిద నీరాజనాలు సమర్పించారు. ఆరుద్రోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అర్చక స్వాములు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశ్వీరచనాలు పలికారు.
భక్తిశ్రద్ధలతో ఆరుద్రోత్సవం