
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ముగిసింది. ఈనెల 3 నుంచి 10 వరకు ఎన్నికల నామినేషన్లను స్వీకరించగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నుంచి భారీసంఖ్యలో నామినేషన్లు వెల్లువెత్తాయి. శుక్రవారం చివరిరోజు కావడంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు బీఫారాలతో హుటాహుటిన నామినేషన్లు వేసే రిటర్నింగ్ అధికారి కేంద్రాలకు వచ్చి నామినేషన్లు వేశారు. షాద్‌నగర్ మినహా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్‌తో సహా 13 నియోజకవర్గాల్లో మొత్తంగా 275 మంది అభ్యర్థులు.. 479 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో చివరి రోజే 217 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా..మహబూబ్‌నగర్ నియోజకవర్గ స్థానంలో అత్యధికంగా 31 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, నారాయణపేట నియోజకవర్గంలో అత్యల్పంగా 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 52 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేయగా, నారాయణపేటలో కనిష్టంగా 19 సెట్ల నామినేషన్లు వచ్చాయి. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా, అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 15 వరకు గడువు ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడం... పోలింగ్‌కు మరో 19 రోజులే ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం హోరెత్తనుంది.
వనపర్తి నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు 39 సెట్ల నామినేషన్లు వేశారు. చివరిరోజు 15 నామినేషన్లు దాఖలు కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి, బీజేపీ నుంచి అనుజ్ఞరెడ్డి, అదే పార్టీ నుంచి చంద్రయ్య, బీఎస్పీ నుంచి మండ్ల మైబూస్, చెన్నరాములు నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్‌రెడ్డి తరఫున మరో నామినేషన్ దాఖలైంది. వీరితో పాటు 9 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో శుక్రవారం 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కొండా మణెమ్మ, జనసేన నుంచి వంగా లక్ష్మణ్‌గౌడ్, నామినేషన్లు వేయగా.. మొత్తం 30 మంది అభ్యర్థులు 47 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో శుక్రవారం 31 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఆచారి నామినేషన్ వేయగా, ఆయనకు మద్దతుగా కేంద్ర మంత్రి భగవత్ కుబా వెంట వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి తరఫున ఆయన భార్య మాధవి, మరో మద్దతుదారుడు, బీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ తరుఫున ఒకరు, బీఎస్పీ అభ్యర్థి కొమ్ము శ్రీనివాస్‌యాదవ్ నామినేషన్లను వేశారు. మొత్తం 28 మంది 52సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో చివరిరోజు బీఆర్‌ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి సతీశ్‌మాదిగ, బీఎస్పీ అభ్యర్థి నాగార్జున నామినేషన్లు వేశారు. శుక్రవారం14 నామినేషన్లు రాగా, మొత్తం 19 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో శుక్రవారం బీఆర్‌ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా...శుక్రవారం 12 నామినేషన్లు రాగా.. మొత్తం 21 మంది అభ్యర్థులలు 38 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా
వనపర్తి జిల్లా
చివరి రోజు 217 నామినేషన్ల దాఖలు
పోటాపోటీగా బరిలోకి స్వతంత్రులు
ఆఖరి రోజు దేవరరద్ర, అలంపూర్ బీజేపీ అభ్యర్థిత్వాలు ఖరారు
బీఫారాలతో హడావుడిగాఆర్వో కేంద్రాలకు పరుగులు
ఈనెల 13న పరిశీలన,15న తుది జాబితా విడుదల
ఇక హోరెత్తనున్న ఎన్నికల ప్రచారం



దేవరకద్రలో నామినేషన్ దాఖలు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డి

దేవరకద్రలో నామినేషన్ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డి