
గండేడ్‌లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ మహమ్మదాబాద్: వలసలను నివారించడంతో పాటు గ్రామాల కు చెందిన వారికి స్థానికంగా పని కల్పించాలనే సదుద్దేశంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఎంతో మంది పేదలు స్థానికంగానే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తు త ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో ఉన్న 100 రోజుల పనిదినాలను క్రమంగా తగ్గిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగైదు ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న లేబర్ బడ్జెట్‌ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లోనూ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇప్పటికే అ నేక ఆంక్షలతో ఉపాధి హామీ పథకం నామమాత్రంగా కొనసాగుతుంది. దీనికితోడు సకాలంలో కూలి డబ్బులు రావడం లేదనే కారణంతో పనులు చేసేందుకు కూలీలు సైతం ముందుకు రావడం లేదు.
రెండేళ్లలోనే 20 లక్షలు..
గడిచిన ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పనిదినాలు పరిశీలిస్తే క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 40 లక్షల పనిదినాలు కల్పించారు. 2019– 20లో 48 లక్షలకు, 2020– 21లో 41.86 లక్షలకు పెంచారు. కానీ, 2021– 22 సంవత్సరంలో 35.97 లక్షలకు తగ్గించగా.. ప్రస్తుత 2022– 23 సంవత్సరంలో 28.06 లక్షల పనిదినాలకు పరిమితం చేసింది.
గ్రామానికి
20 పనులు..
ప్రతి పంచాయతీకి 20 చొప్పున పనులు కేటాయించారు. వీటికి కూలీలు ఎక్కువగా హాజరై సకాలంలో పూర్తి చేస్తేనే మరో పనిచేసే అవకాశం ఉంటుంది. గతంలో ఎక్కువ మంది కూలీలు హాజరైతే 15 శాతం పనిదినాలను పెంచుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం పనులకు హాజరైన కూలీల సంఖ్య, పనుల కేటాయింపు, చెల్లింపులు అన్ని ఆన్‌లైన్‌లోనే నిర్వహించాల్సి వస్తుంది. దీంతో కూలీల డిమాండ్‌కు అనుగుణంగా పనులు కల్పించలేని పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం రోజు వారి కూలీ రూ.257గా నిర్ణయించారు. నిర్ణీత కొలత ప్రకారం పని పూర్తి చేస్తేనే ఈ కూలీ చెల్లిస్తారు. కానీ, కొలతల ప్రకారం పనులు జరగకపోవడంతో కూలీలకు రూ.200లకు మించి రావడం లేదు.
వారంలో కొత్త బడ్జెట్
వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరానికి చెందిన లేబర్ బడ్జెట్ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు గాను జిల్లాలో ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించి ఉపాధి హామీ పథకం పనుల ప్రణాళికను ఖరారు చేశారు. ఇందులో కందకాలు తవ్వకం, వ్యవసాయ భూముల అభివృద్ధి, హరితహారం, రాళ్ల కట్టలు, మట్టి కట్టలు, చెరువుల్లో పూడికతీత, కాల్వల తవ్వకాల పనులు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మేరకు గ్రామాల వారీగా చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో ఈ పథకానికి నిధుల కేటాయింపును తగ్గిస్తూ వస్తుంది. దీంతో కూలీల పనిదినాల్లో భారీగా కోత విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్రమంగా పనిదినాలు
తగ్గిస్తున్న కేంద్ర ప్రభుత్వం
నాలుగేళ్లుగా లేబర్ బడ్జెట్‌లో కోత
ఇప్పటికే అనేక కొర్రీలతో నామమాత్రంగా మారిన పథకం
కొత్త నిబంధనలతో
పనులకు రాని కూలీలు
పథకాన్ని ఎత్తి వేసే కుట్ర
అంటున్న కార్మిక సంఘాలు