మరణంలోనూ వీడని స్నేహ బంధం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహ బంధం

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

నల్లబెల్లి: ఎన్నో ఏళ్లుగా ఒకే రంగంలో పనిచేశారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలిచారు. సొంతంగా లారీ కొనుగోలు చేసి ఓనర్లుగా ఎదగాలని కలలు కన్నారు. కుటుంబాలకు మెరుగైన భవిష్యత్‌ ఇవ్వాలని తాపత్రయపడ్డారు. కానీ, విధి వారి ఆశలను మధ్యలోనే చిదిమేసింది. మొక్కజొన్నల లోడుతో వచ్చిన లారీని రోడ్డుపక్కన నిలిపి ఫ్యాక్టరీకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదం ఇద్దరు స్నేహితులను బలితీసుకుంది. సిద్దిపేట జి ల్లా కోహెడ మండలం శంకర్‌నగర్‌ క్రాస్‌ వద్ద ఆది వారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాదకర ఘ టనలో వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం ఒల్లే నర్సయ్యపల్లికి చెందిన చెంచు రాజు, రంగాపూర్‌కు చెందిన కొయ్యాల శ్రీనివాస్‌ మృతి చెందారు.

ఒకే దారి.. ఒకే కల..

రాజు, శ్రీనివాస్‌ స్నేహితులు. దాదాపు 15 ఏళ్లకుపైగా పరిచయం ఉంది. డ్రైవర్లుగా పనిచేస్తూ ఎన్నో కిలోమీటర్లు కలిసి ప్రయాణించారు. చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కుటుంబాలను పోషించారు. ఇతరుల లారీలను నడుపుతూ ఎప్పటికై నా సొంత లారీ కొనుగోలు చేసి ఓనర్లుగా ఎదగాలని కలలు కనేవారు. ఆ కలను నిజం చేసుకునే క్రమంలో రెండేళ్ల క్రితం రాజు లారీ కొనుగోలు చేశాడు. ఆ లారీతోనే కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి సరుకు రవాణాచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

పిల్లల భవిష్యత్‌ కోసం తపన..

చెంచు రాజుకు భార్య మంజుల, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించి పిల్లలను మంచి స్థాయికి తీసుకెళ్లాలన్న తపనతో పని చేసేవాడు. సొంతంగా లారీ కొనుగోలు చేసిన తర్వాత తమ కుటుంబ పరిస్థితులు మెరుగుడతాయని ఆశించాడు. కానీ, ఆ ఆశలను ప్రమా దం ఆవిరి చేసింది. కొయ్యాల శ్రీనివాస్‌కు భార్య సరిత,ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం కష్టపడి పనిచేసిన శ్రీనివాస్‌ ఇక తిరిగిరాడన్న నిజాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి కోసం ఎదురుచూస్తున్న ఆ ఇద్దరు కుమారులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.

రెండు కుటుంబాల్లో తీరని శోకం..

ఒకే వృత్తి.. ఒకే లక్ష్యం.. విడదీయరాని స్నేహం. చివరకు మరణంలోనూ ఇద్దరు కలిసే వెళ్లారు. రాజు, శ్రీనివాస్‌ మృతితో ఒల్లెనర్సయ్యపల్లి, రంగాపురం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబాలకు అండగా నిలిచిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి దూరం కావడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లారీ ఓనర్లుగా ఎదగాలన్న కలతో మొదలైన వారి ప్రయాణం.. అదే లారీతో వచ్చిన చివరి ప్రయాణంగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

ప్రయాణం.. విషాదాంతం

మాట్లాడుతున్న సాంబశివరావు

రోడ్డు దాటుతుండగా బొలెరో ఢీ.. ఇద్దరు స్నేహితుల మృతి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం

శంకర్‌నగర్‌ క్రాస్‌ వద్ద ఘటన

ఒల్లే నర్సయ్యపల్లి, రంగాపురం

గ్రామాల్లో విషాదఛాయలు

నర్సంపేట నుంచి మొక్కజొన్నల లోడుతో లారీలో బయలుదేరిన రాజు, శ్రీనివాస్‌ సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలోని ఇథనాల్‌ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. శంకర్‌నగర్‌ క్రాస్‌రోడ్డు వద్ద లారీని రోడ్డు పక్కన నిలిపారు. అనంతరం ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ఇద్దరు కలిసి రోడ్డు దాటుతుండగా, అదే సమయంలో గుర్తు తెలియని బొలెరో వాహనం అతివేగంగా వచ్చి వారిద్దరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. ఏళ్లుగా కలిసి సాగిన వారి ప్రయాణం అక్కడే విషాదాంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement