ప్లాస్టిక్‌ షాపులో షార్ట్‌సర్క్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ షాపులో షార్ట్‌సర్క్యూట్‌

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

అధైర్య పడొద్దు అండగా ఉంటాం

: ఎమ్మెల్యే కె.ఆర్‌ నాగరాజు

ఖిలా వరంగల్‌: షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంఘటన ఏనుమాముల ఎన్టీఆర్‌నగర్‌ రోడ్డులోని సాయి ప్లాస్టిక్స్‌ షాపులో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ రంగశాయిపేటకు చెందిన జక్కు రామకృష్ణ ఎన్టీఆర్‌నగర్‌ రోడ్డులో సాయి ప్లాస్టిక్స్‌ షాపు ఏర్పాటు చేసి జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి షాపును మూసివేసి రంగశాయిపేటలోని ఇంటి వెళ్లాడు. షార్ట్‌సర్క్యూట్‌తో ఆదివారం ఉదయం 8 గంటలకు షాపులో మంటలు వ్యాపించాయని సమాచారం అందింది. రామకృష్ణ వచ్చేలోపే అన్ని వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాక అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి నాలుగు ఫైర్‌ ఇంజన్లతో ఐదుగంటలు శ్రమించి మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చారు. షాపు గోదాములో సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన పాత ప్లాస్టిక్‌, ఇతర వస్తువులు, బొలెరో ట్రాలీ వాహనం అగ్నికి ఆహుతయ్యాయని బాధితుడు తెలిపాడు. కాగా, బొలెరో వాహనం రూ.8 లక్షలు, షెడ్డు నిర్మాణం రూ.10 లక్షలు, రీసైక్లింగ్‌ మిషనరీ రూ.8 లక్షలు, ప్లాస్టిక్‌ స్క్రాప్‌ స్టాక్‌, ఫర్నిచర్‌ రూ.5 లక్షలు అంచనావేసి మొత్తం రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు రెవెన్యూ, పోలీసులు, ఫైర్‌ అధికారులు గుర్తించారు. అగ్నిమాపక జిల్లా అధికారి సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, మామునూరు ఇన్‌స్పెక్టర్‌ జవ్వాజీ సురేశ్‌, ఫైర్‌ అధికారులు ఎం.డి అయూబ్‌, దిలీప్‌కుమార్‌, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి కారణమిదే

అగ్ని ప్రమాదంపై బాధితుడు జక్కు రామకృష్ణ అనుమానాలు వ్యక్తం చేశాడు. పక్కన ఉన్న సూరం ప్రభాకర్‌రెడ్డి షెడ్డుకు తన అనుమతి లేకుండా కాంపౌండ్‌ వాల్‌మీదుగా అక్రమంగా విద్యుత్‌ తీగ లాగాడు. మూడు రోజుల క్రితమే ఆ వైరు నుంచి మంటల రవ్వలు రావడంతో గమనించిన వర్కర్లు బాధితుడికి తెలిపారు. వెంటనే అతడు ప్రభాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి విద్యుత్‌ తీగను తొలగించాలని విజ్ఞప్తి చేశాడు. తీగ తొలగించకపోవడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని బాధితుడు పేర్కొన్నాడు. అగ్నిప్రమాదంతో రోడ్డున పడ్డానని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు.

ఎన్టీఆర్‌నగర్‌ రోడ్డులో

భారీ అగ్ని ప్రమాదం

కాలిపోయిన బొలెరో ట్రాలీ వాహనం, వస్తువులు, పాత సామగ్రి ,పరికరాలు

నాలుగు ఫైరింజన్లతో ఐదుగంటలపాటు మంటలార్పిన సిబ్బంది

సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం

వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాద తీవ్రతను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు గల కారణాలను అధికారులు, బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడు జక్కు రామకృష్ణకు న్యాయం జరిగేలా నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. అధైర్య పడొద్దు మీకు అండగా ఉంటానని, అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement