కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు దందా చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్డర్ కాపీలో వరంగల్ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉద్యోగానికి ఎంపికయ్యారని రాతపూర్వకంగా ఇస్తూ, ఉద్యోగం మాత్రం వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అని నిండా మోసం చేస్తున్నారు. నిరుద్యోగుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, గ్రామాల్లో సరిగా చదువురాని వారిని ఎంపిక చేసుకుని ఇంగ్లిష్‌లో నకిలీ ఆర్డర్ కాపీ అందజేస్తున్నారు. ఉద్యోగాల ఆశతో నిరుద్యోగులు నకిలీ ఆర్డర్ కాపీని అసలు ఆర్డర్‌గా భావిస్తూ తీసుకుంటున్నారు. వరంగల్ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యారంటూ పేరుతో పాటు ఉత్తర్వు నంబర్‌తో నకిలీ ఆర్డర్ కాపీ ఇస్తూ ఎంజీఎంలో మీకు ఉద్యోగం ఇప్పిస్తున్నామని చెబుతున్నారు. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీంలో పోస్టింగ్‌తో నెలకు రూ.36,000 వేతనం, ఈ నెల 3న జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేశారని, వరంగల్ పాత డీఎంహెచ్‌ఓ జారీ చేశారంటూ నమ్మకం కలిగేలా నకిలీ ఆర్డర్ కాపీని తయారు చేశారు. ఇందులో 13 రోజుల్లో డ్యూటీలో జాయిన్ కావాలని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రూ.110 బాండ్ పేపర్, ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని రావాలని పాత డీఎంహెచ్‌ఓ పేరుతో కూడిన సంతకం ఆర్డర్ కాపీని అందజేస్తున్నట్లు సమాచారం. దీంతో నకిలీ ఆర్డర్ కాపీ అయినప్పటికీ తెలియక అదే వరంగల్ సూపర్ హాస్పిటల్‌లో ఉద్యోగానికి అసలు కాపీగా భావిస్తూ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వాస్తవ పరిస్థితులు..
వాస్తవానికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉద్యోగాల ఎంపిక కోసం ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. అలాగే, పాత డీఎంహెచ్‌ఓ ప్రస్తుతం వరంగల్ డీఎంహెచ్‌ఓగా లేరు. ఇందులో ఈనెల 3న ఆర్డర్ కాపీని జారీ చేసినట్లు తయారు చేశారు. ఇలా నకిలీ ఆర్డర్ కాపీలు తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్న దళారుల దందాపై అధికారులు స్పందించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
డీఎంహెచ్‌ఓ ఆఫీస్‌లో జాబ్ అని
నకిలీ ఆర్డర్ కాపీ
పాత డీఎంహెచ్‌ఓ పేరుతో
ఫోర్జరీ సంతకం
గ్రామాల్లో నిరుద్యోగుల నుంచి
రూ.లక్షల వసూలు


