గూడూరు: మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనరేటర్లు నిరుపయోగంగా నిలిచాయి. 2006–07 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా లేని సమయంలో అంతరాయం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రూ.లక్షలు వెచ్చించి జనరేటర్లను ఏర్పాటు చేసింది. కానీ కార్యాలయాల్లో వాటిపై సరైన నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా ప్రారంభించిన రెండేళ్లకే వినియోగంలో లేకుండా పోయినట్లు తెలిసింది.
జిల్లాలోని 18 మండలాల తహసీల్దార్ కార్యాలయాలకు అప్పటి ప్రభుత్వం ఒక్కో జనరేటర్‌కు రూ.2లక్షలకు పైగా ఖర్చు చేసి ఏర్పాటు చేయించారు. ఐతే అప్పటి విద్యుత్ అంతరాయంతో ప్రజల అవసరాలకు తహసీల్దార్ కార్యాలయాల్లో జనరేటర్ల ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొన్నాళ్లపాటు బాగా జరిగాయి. ఆ తరువాత వాటిపై ఎవరి పర్యవేక్షణ, సరైన మెయింటనెన్స్ లేకపోవడంతో పనిచేయకుండా నిరుపయోగంగా మారాయి. దీంతో జనరేటర్లు తుప్పు పడుతున్నాయి.
విద్యుత్ పోతే పనులకు ఆటంకమే..
తహసీల్దార్ కార్యాలయాల్లోని జనరేటర్లు నిరుపయోగంగా మారడంతో విద్యుత్ పోతే పనులకు ఆటంకం ఏర్పడుతుంది. కొన్నేళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల పనులు జరుగుతున్నాయి. ప్రతీ రోజు కార్యాలయంలో ఎక్కువగా ఇంటర్నెట్‌తోపాటు కంప్యూటర్ సిస్టమ్‌ల ద్వారా పనులు ఎక్కువగా జరుగుతాయి. దీంతో ఆ పనులు చేసే సమయంలో విద్యుత్ కోతలు, మరమ్మతుల పేరుతో విద్యుత్ నిలిపితే నిరీక్షించాల్సి వస్తుంది. ఒక్కోసారి పనులు రేపటికి వాయిదా వేస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనరేటర్ల పనితీరుపై జిల్లాలోని పలువురు తహసీల్దార్‌లను అడగ్గా, జనరేటర్లు పనిచేయడం లేదన్నది వాస్తవమే అని తెలిపారు. ఇప్పటికై నా ప్రజాధనం వృథా కాకుండా, కొద్దిపాటి మరమ్మతుల్లో ఉన్న జనరేటర్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
రూ.లక్షల ప్రజాధనం వృథా
తహసీల్దార్ కార్యాలయాల్లో
పనిచేయని జనరేటర్లు
నిర్వహణ, పర్యవేక్షణ కరువు


