డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరాకు నిత్యం అంతరాయం కలుగుతుండడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడంలేదు. పైప్‌లైన్ పగలడం, లీకేజీలు, తక్కువ నీటి సరఫరా అవుతుండడంతో సరఫరాకు ఆటంకం కలిగి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2.80 లక్షల లీటర్ల నీరు అవసరం..
డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో సుమారు 18 వేల జనాభాకు ప్రతీ రోజూ 2.80 లక్షల లీటర్ల తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. మున్సిపాలిటీ పరిధిలో ఒక్కొక్కరికీ నిబంధనల ప్రకారం 135 లీటర్ల నీరు సరఫరా చేయాల్సి ఉండగా వంద లీటర్ల లోపు నీరు కూడా సరఫరా కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో భగీరథ నీటి సరఫరా జరగడం లేదు. పట్టణ పరిధిలో సుమారు 3000 ప్రైవేట్, 60 వరకు పబ్లిక్ నల్లాలు ఉన్నాయి. మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో 6లక్షలు, 2.5 లక్షలు, 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా భగీరథ పైప్‌లైన్ ద్వారా ట్యాంకులను నింపి పట్టణానికి నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చర్చి కాంపౌండ్, జయపురం, కిరీటాపురం, బంకట్‌సింగ్ తండా, నెహ్రూ స్ట్రీట్, సుభాష్ స్ట్రీట్, రాజు తండా, సిగ్నల్ తండాలకు పెద్ద చెరువులోని బోరుబావులు, ఆయా ప్రాంతాల్లోని రక్షిత మంచినీటి బావుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
మున్నేరులో నిండుగా నీరు..
డోర్నకల్ పట్టణ సమీపంలోని మున్నేరు వాగులో ప్రస్తుతం నిండుగా నీరు ఉంది. భగీరథ పైప్‌లైన్ ఏర్పాటు కాకముందు వాగునుంచి పైప్‌లైన్ ద్వారా ఫిల్టర్‌బెడ్‌కు నీటిని తరలించి శుద్ధి చేసి పట్టణానికి సరఫరా చేసేవారు. భగీరథ నీటి సరఫరా ప్రారంభమైన తర్వాత వాగు వద్ద ఏర్పాటు చేసిన పంప్ హౌస్‌తోపాటు మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలోని ఫిల్టర్‌బెడ్ నిరుపయోగంగా మారాయి. ఇటీవల పంప్ హౌస్‌లో రెండు 30 హెచ్‌పీ మోటార్లకు మరమ్మతు చేయించి నూతనంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అయితే మళ్లీ స్వల్ప మరమ్మతు ఏర్పడడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం తరచూ మిషన్ భగీరథ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాన్ని మున్నేరుతో భర్తీ చేయాలని అందుకోసం మరమ్మతు పనులు త్వరగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మా కష్టాలు పట్టించుకోవడం లేదు..
భగీరథ సరఫరాలో నిత్యం అంతరాయం కలుగుతుంది. ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు పాలకవర్గం పట్టించుకోవడం లేదు. వారానికోసారి కూడా నీరు సరఫరా కాకపోగా అప్పడప్పుడు కలుషిత నీరు వస్తుంది. – ఠాగూర్ రాంసింగ్,
విశ్రాంత ఉద్యోగి, డోర్నకల్
ప్రత్యామ్నాయాలు వినియోగిస్తాం
డోర్నకల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగిస్తాం. మున్నేరువాగు నుంచి నీటి సరఫరా చేసేందుకు విద్యుత్ మోటా ర్లు, పైప్‌లైన్ వినియోగిస్తాం. ఫిల్టర్ బెడ్‌కు మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. – నాగరాజు,
మున్సిపల్ కమిషనర్, డోర్నకల్
డోర్నకల్‌లో నిత్యం తాగునీటి సరఫరాలో అంతరాయం
మున్నేరులో నిండుగా నీరు
నిరుపయోగంగా పంప్ హౌస్, ఫిల్టర్‌బెడ్
నిరుపయోగంగా ఫిల్టర్‌బెడ్..
మున్నేరువాగు నుంచి పైప్‌లైన్ ద్వారా వచ్చే నీటిని శుద్ధి చేసి పట్టణానికి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. భగీరథ నీటి సరఫరా ప్రారంభం కావడంతో ఫిల్టర్‌బెడ్ సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం ఫిల్టర్‌బెడ్‌కు చిన్నపాటి మరమ్మతులు చేయించి ఆలం, ప్రత్యేక ఇసుక లాంటి పదార్థాలతో నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం భగీరథ నీటి సరఫరాకు నిత్యం అంతరాయం కలుగుతుండడంతో మున్నేరువాగు ద్వారా నీటిని ఫిల్టర్‌బెడ్‌కు తరలించి శుద్ధి చేసి పట్టణానికి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిత్యం తాగునీటి ఇబ్బందులు ఎదురవుతుండగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను వినియోగించడంలో అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం వహించడం సరికాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.


