● డబ్ల్యూసీఓజీ–2026లో
తెలుగుపరిశోధకుడికి ఫస్ట్ ప్రైజ్
రాయపర్తి : న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ గ్యాస్ట్రోఎంటరాలజీ సదస్సు (డబ్ల్యూసీఓజీ–2026)లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన యువ పరిశోధకుడు వశపాక అనిల్ చరిత్ర సృష్టించాడు. 51 దేశాల నుంచి 3 వేల మంది ప్రముఖ వైద్యులు, నోబెల్ గ్రహితలు ఈ అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈనెల 2న నిర్వహించిన యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డ్స్–లుమినల్ విభాగంలో తొలి బహుమతిని తెలుగు పరిశోధకుడు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్‌కు చెందిన అనిల్ కై వసం చేసుకున్నాడు. భారతీయుల జన్యు నిర్మాణానికి సంబంధించిన కొలొరెక్టల్ క్యాన్సర్‌పై ఆయన చేసిన పరిశోధన శ్రీఇండియన్ ఎథ్నిసిటి–స్పెసిపిక్ మల్టీ ఓమిక్ ల్యాండ్‌స్కేప్ ఆఫ్ కొలొరెక్టల్ క్యాన్సర్, నోవెల్ సిగ్నేచర్, డ్రైవర్స్, అండ్ థెరపీటిక్ టార్గెట్స్‌శ్రీకు ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ద్వితీయ బహుమతి ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన లలితా మెహ్రాకు, దీక్షా ఝాకు తృతీయ బహుమతి లభించినట్లు తెలిపారు. దేశంలోనే అత్యున్నత వైద్య సంస్థ అయిన ఎయిమ్స్ పరిశోధనలను అధిగమించి, అంతర్జాతీయ వేదికపై రాయపర్తి యువకుడు ఫస్ట్ ప్రైజ్ సాధించడం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా అనిల్ తల్లిదండ్రులు తిర్మలాయపల్లి మాజీ సర్పంచ్ వశపాక కుమారస్వామి, వినోద దంపతులతోపాటు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిధుల స్వాహాపై
కొనసాగుతున్న విచారణ
జఫర్‌గఢ్ : మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నిధుల స్వాహాకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన తాజొద్దీన్ ఫోర్జరీ సంతకాలతో రూ.42 లక్షలు స్వాహా చేసినట్లు ప్రిన్సిపాల్ వరలక్ష్మి ఆగస్టు 17న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు తాజొద్దీన్‌పై చీటింగ్ కేసు నమోదు చేయడంతో పాటు అతడి కోసం గాలింపు చేపడుతున్నా ఇంకా పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా లక్షలాది నిధుల దుర్వినియోగంపై సంబంధిత ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి ఎంసీ సామెల్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ఈ నెల 1న ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో సామెల్ నేతృత్వంలో సంబంధిత టెక్నికల్ ఉద్యోగులు, అధికారుల బృందం జఫర్‌గఢ్ గురుకుల పాఠశాలలో శనివారం విచారణ చేపట్టారు.


