ఉప్పల్: మానసిక ఒత్తిడి తట్టుకోలేక జర్మనీనుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ యువకుడు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రామంతాపూర్ బాలకృష్ణానగర్‌లో శనివారం తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. రామంతాపూర్ బాలాకృష్ణానగర్ ప్రాంతానికి చెందిన వీరగాని మల్లేషం, వృత్తి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. వీరి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు. ఈయనకు ఇద్దరు కుమారులు వీరగాని విద్యాసాగర్(29), ప్రేమ్‌సాగర్ ఉన్నారు. తల్లి 2014లోనే మృతి చెందింది. ఆ తరువాత తండ్రి అన్నీ తానై పెద్దకుమారుడు విద్యాసాగర్‌ను చదివించి ఉన్నత చదువుల కోసం 2019 డిసెంబర్‌లో అమెరికాకు పంపాడు. అక్కడ చదువు పూర్తి చేసుకున్న అనంతరం ఉద్యోగం ప్రారంభించాడు. నానమ్మ చనిపోవడంతో 2023లో నగరానికి వచ్చి తిరిగి వెళ్లిపోయాడు. తదనంతరం ట్రంప్ దెబ్బకు, వీసా సమస్యలు, హెచ్–1బీ అవ్వకపోవడం లాంటి అనేక సమస్యలు ఎదుర్కొన్న విద్యాసాగర్ 2025, ఏప్రిల్‌లో నగరానికి వచ్చాడు. అక్కడినుంచి గత జూలైలో జాబ్ కోసం జర్మనీకి వెళ్లాడు. అక్కడ కూడా సరైన ఉద్యోగం లభించక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితులు అనుకూలించక నాన్నకు ఫోన్ చేసి టికెట్‌కు డబ్బులు పంపమని చెప్పి ఆదివారం నగరానికి చేరుకున్నాడు. అతన్ని ఎయిర్‌పోర్టు నుంచి తండ్రి మల్లేషం సోదరుడు ప్రేమ్ సాగర్‌లు కలిసి తీసుకువచ్చారు. అనంతరం తండ్రి పని మీద స్వగ్రామానికి వెళ్లాడు. విద్యాసాగర్ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. మధ్యాహ్నం సోదరుడు అన్న కోసం బిర్యాని ఆర్డర్ పెట్టాడు. బిర్యాని రాగానే తలుపు తట్టినా లేవకపోవడతో అలసిపోయి నిద్రిస్తున్నాడేమో అనుకుని ఊరుకున్నాడు. తండ్రి సాయంత్రం ఇంటికి వచ్చి తలుపులు తట్టగా లేవకపోవడంతో కిటికీలోనుంచి చూశాడు. ఫ్యాన్‌కు విద్యుత్ తీగతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. తలుపులు బలవంతంగా తెరిచి కిందకు దింపారు. అప్పటికే విద్యాసాగర్ మృతిచెందాడు. చనిపోయిన సమయంలో చెవిలో హియర్ ఫోన్‌లు పెట్టుకుని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరితోనో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మానసిక ఒత్తిడికి గురయ్యాడా? లేక ప్రేమ వ్యవహారమా అన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
జర్మనీనుంచి తిరిగొచ్చిన విద్యాసాగర్
హైదరాబాద్ రామంతాపూర్‌లో ఘటన
మృతుడి స్వస్థలం నెల్లికుదురు


