గణపురం : ‘మా కొడుకు ఆత్మహత్య చేసుకునే పిరికి వాడు కాదు. మా కోడలు బుద్దారం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులతో కలిసి హత్య చేసింది’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మృతుడు పెండ్యాల సంపత్ తల్లిదండ్రులు వనమ్మ, జంపయ్య ఆరోపించారు. ఈ మేరకు బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన సుమలతతో కొద్ది సంవత్సరాల క్రితం తమ కుమారుడు సంపత్‌కు వివాహం జరిగిందని, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానమని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన తమ కుమారుడు సంపత్ తన భార్య సుమలత దగ్గరకు వచ్చాడన్నారు. అయితే 18వ తేదీన తమ కుమారుడు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫోన్‌లో సమాచారం అందిందన్నారు. దీంతో తాము కుటుంబీకులతో కలసి బు ద్దారం వచ్చి తమ కుమారుడి మృతదేహాన్ని చూసి శరీరంపై గాయాలు ఉన్నట్లు గమినించామని తెలిపారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికి వాడు కాదని, అత్తింటి వారే హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అశోక్ కుమార్ తెలిపారు.
పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు?
సంపత్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడనే మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం రాత్రి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతుడు ఆత్మహత్య చేసుకున్న రోజు ఎవరెవరు అతడికి ఫోన్ చేశారు? అతడితో ఎవరు మద్యం సేవించారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మా కోడలు కొందరితో కలిసి చంపింది
పోలీసులకు మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు


