● ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
పెద్దవంగర: అణగారిన వర్గాల్లో సామాజిక చైతన్యం రగిలించిన చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలంలోని గంట్లకుంట గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంగళవారం టీపీసీసీ అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరాజేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేతతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, తెగువ పోరాట స్ఫూర్తిని నింపాయని గుర్తు చేశారు. గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సర్పంచ్ పాయిలి యాకలక్ష్మి సోమన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి, బీసీ సంఘాల నాయకులు వట్టె జానయ్య, కూరపాటి రమేష్, చంద మల్లయ్య, బీసు హరికృష్ణ, నిర్వాహకులు కొండ్రాతి శ్రీనాథ్, కొమురమల్లు, యాకయ్య, ఉమాచందర్, శ్రీకాంత్, నాయకులు పాల్గొన్నారు.


