నల్లా నరసింహులు | - | Sakshi
Sakshi News home page

నల్లా నరసింహులు

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

మూడుసార్లు ఉరిశిక్ష.. ‘తెలంగాణ టైగర్‌’గా పేరు

విప్లవ సింహం

జనగామ : ఒకవైపు నిజాం నిరంకుశ పాలన.. మరోవైపు దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల దోపిడీ, వెట్టి చాకిరీ, భూముల ఆక్రమణ, దౌర్జన్యాలు. వెరసి తెలంగాణ పల్లెలు అల్లాడుతున్న రోజులు. భూమి ఉన్నా సాగు హక్కు లేని రైతులు. కష్టపడినా ఫలితం దక్కని కూలీలు. దొరల గడీల ముందు తలవంచి బతకాల్సిన పరిస్థితి. అలాంటి భయానక వాతావరణంలో ప్రజలకు అండగా నిలిచి, వారిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు నల్లా నరసింహులు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జనగామ ప్రాంతం నుంచి వెలుగులోకి వచ్చిన ఈ విప్లవ సింహం తన జీవితాన్ని ప్రజా పోరాటానికే అంకితం చేశారు. నేడు (బుధవారం) నల్లా నరసింహుల శత జయంతి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

కడవెండి బిడ్డగా.. పోరాట యోధుడిగా

1926, అక్టోబర్‌ 2న ప్రస్తుత జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడవెండిలో పద్మశాలి కుటుంబంలో నల్లా నరసింహులు జన్మించారు. చేనేత వృత్తి చేస్తూ ఉర్దూ మాధ్యమంలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. చిన్న వయసులోనే పల్లెల్లో నెలకొన్న సామాజిక అసమానతలు, భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీ ఆయనను కలచివేశాయి. ప్రజల కష్టాలను తనవిగా భావించి ఉద్యమ బాట పట్టారు.

ఆంధ్ర మహాసభతో ప్రజల్లో చైతన్యం..

తెలంగాణలో ప్రజా చైతన్యానికి వేదికగా మారిన ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో నరసింహులు చురుగ్గా పాల్గొన్నారు. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభ అనంతరం జనగామ తాలూకాలో గ్రామాల్లో ప్రజలను సంఘటితం చేస్తూ సంఘం దళాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. కడవెండి నుంచే తన పోరాటానికి శ్రీకారం చుట్టి పల్లెపల్లెకూ వెళ్లి ప్రజలను ఏకం చేశారు. అట్టడుగు వర్గాల ప్రజల్లో ధైర్యం నింపి దోపిడీకి వ్యతిరేకంగా నిలబడేలా చేశారు.

నల్లా నరసింహులు (ఫైల్‌)

నిజాం పాలన అనంతరం కూడా నరసింహులుపై ప్రభుత్వ కేసులు కొనసాగాయి. పలుమార్లు అరైస్టె చిత్రహింసలకు గురయ్యారు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. మూడుసార్లు ఉరిశిక్ష విధించినా ఆయన వెనుకడుగు వేయలేదు. జైలు నుంచే ధైర్యంగా తన వాదనలు వినిపించారు. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన న్యాయ, పోలీసు వర్గాల్లో తెలంగాణ టైగర్‌గా పిలిచినట్లు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. చివరకు పుచ్చలపల్లి సుందరయ్య, తదితరుల చొరవతో 1959, జనవరి 26న జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం కూడా ప్రజాఉద్యమాలకు దూరం కాలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వేలాది మంది యోధుల స్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రజా సమస్యలపై తన గళం వినిపించారు. జీవిత భాగస్వామి వజ్రమ్మతో కలిసి ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచారు. 1993, నవంబర్‌ 5న కన్నుమూశారు. అయితే ఆయన పోరాట స్ఫూర్తి జనగామ నేలపై నేటికీ కొనసాగుతోంది.

దొరల దౌర్జన్యానికి ఎదురొడ్డిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు

కడవెండి బిడ్డగా పుట్టి

తెలంగాణ టైగర్‌గా గుర్తింపు

నేడు నల్లా నరసింహులు శత జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement