వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

బంధువులను పరామర్శించి వస్తూ.. మృత్యుఒడికి

హసన్‌పర్తి: అనారోగ్యంతో బాధపడుతున్న తమ బంధువులను పరామర్శించి వస్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరుకుంది. బైక్‌ అదుపు తప్పిన ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ముచ్చర్ల ఓఆర్‌ఆర్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరుకు చెందిన ముద్ర కోలా రాధ(55), రమేశ్‌ దంపతులు అనారోగ్యం బాధపడుతున్న తమ బంధువులను పరామర్శించడానికి మంగళవారం ఉదయం బైక్‌పై కడిపికొండకు వెళ్లారు. పరామర్శ అనంతరం ఇంటికి పయనమయ్యారు. మార్గమధ్యలోని ముచ్చర్ల ఓఆర్‌ఆర్‌ వద్ద బైక్‌ అదుపు తప్పింది. ఈ ఘటనలో రాధకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రకాశ్‌, ఓదెలు ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం క్షతగాత్రురాలిని ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు రాజ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ తెలిపారు.

ట్యాంకర్‌ ఢీకొని పాస్టర్‌..

ఆయిల్‌ ట్యాంకర్‌.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ పాస్టర్‌ మృతి చెందాడు. ఈఘటన హనుమకొండ–కరీంనగర్‌ ప్రధాన రహదారిలోని ఎల్లాపురం బ్రిడ్డి వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్కతుర్తి చర్చి పాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సందెల మాణిక్యం(75) మంగళవారం వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై హనుమకొండ వైపునకు వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలోని ఎల్లాపురం బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న ఆయిల్‌ట్యాంకర్‌.. బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మాణిక్యం తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్‌ సిబ్బంది ప్రకాశ్‌, ఓదెలు ఘటనా స్థలికి చేరుకుని ప్రథమ చికిత్స నిర్వహిస్తుండగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు.

వాగులో కాలుజారి పడి వ్యక్తి..

చిన్నగూడూరు: మూడోరోజు దినకర్మకు హాజరైన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో కాలు జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడురు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మానుపాటి ముత్తయ్య(38) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. ఈ క్రమంలో ఆదివారం తన పెదనాన్న భిక్షం మృతి చెందగా, మంగళవారం మూడో రోజు దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముత్తయ్యతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు ఆకేరువాగు వద్దకు వెళ్లిన ముత్తయ్య.. ప్రమాదవశాత్తు కాలు జారి పడి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలతోపాటు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement