ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2న గాంధీ జయంతి ప్రభుత్వ సెలవు, 3వ తేదీన వారాంతపు సెలవు యార్డు బంద్, 4న ఆదివారం వారాంతపు సెలవు ఉంటుందన్నారు. మార్కెట్‌కు 5వ తేదీన పునః ప్రారంభమవుతుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సెలవుల్లో మార్కెట్‌కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దని చైర్ పర్సన్ కోరారు.
నేడు ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14, 17 బాలబాలికల విభాగంలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి పుల్ల అనిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌లోని ఓ సిటీ మైదానంలో యోగా, ఫెన్సింగ్ ఎంపికలు, ఖమ్మం బైపాస్ రోడ్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో హాకీ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఎంపికలకు హాజరు కావాలని తెలిపారు. క్రీడాకారులు తమ వెంట ఆధార్ కార్డు, స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్, గత సంవత్సర ప్రోగ్రెస్ కార్డు, పుట్టినతేదీ సర్టిఫికెట్లను తీసుకువాలని తెలిపారు.
ఏఏఏ రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్
విద్యారణ్యపురి: గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఏఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా నైనాల నవీన్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శిగా ఎం.డి సులేమాన్ ఎన్నికై నట్లు సంబంధిత సంఘం నాయకులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం నవీన్ ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన హనుమకొండ జిల్లాకు చెందినవారు.
పోక్సో కేసులో నేరస్తుడికి
ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష
వెంకటాపురం(ఎం)/ ములుగు రూరల్: పోక్సో కేసులో నేరస్తుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించినట్లు ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వెంకటాపురం(ఎం) పీఎస్ పరిధిలో 6 సంవత్సరాల క్రితం రామానుజాపూర్ గ్రామానికి చెందిన పల్లెబోయిన క్రాంతిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువుకావడంతో క్రాంతికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.7 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి సూర్య చంద్రకళ మంగళవారం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ చెప్పారు. కోర్టు మానిటరింగ్ అధికారి, డీఎస్పీ కిశోర్, కోర్టు లైజనింగ్ అధికారి, ఏఎస్సై కుమారస్వామి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్ సింగ్, సీడీలు శ్రీను, స్రవంతి.. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేశారని ఎస్పీ పేర్కొన్నారు.
అనుమానాస్పదస్థితిలో
వృద్ధురాలి మృతి
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద ఓ వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మండలంలోని లింబ్యాతండాకు చెందిన భూక్యా శాంతి(70) మంగళవారం చెరువు కట్ట పక్కన అనుమానాస్పదంగా పడి ఉండగా గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ చంద్రమౌళి, ఎస్సై ఝాన్సీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా శాంతి మృతదేహం కనిపించింది. శాంతి సోమవారం పింఛన్ తీసుకునేందుకు గొల్లచర్లకు వచ్చిందని, తర్వాత ఇంటికి రాలేదని కుటుంబీకులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై మృతురాలి కుమారుడు లచ్చు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● గొల్లచర్ల సమీపంలో ఘటన


