పాత ఫోన్లు విక్రయిస్తున్నారా..?
ఖిలా వరంగల్ : పాత ఫోన్లు కొంటామంటూ కొందరు నగరం, పట్టణం, గ్రామాల్లో సంచరిస్తున్నారు. వారి పట్ల కాస్తా జాగ్రత్తగా ఉండాలి..ఈ వ్యాపారం వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందంటే నమ్ముతారా..? చిన్నపాటి ఆశచూపి పాత ఫోన్లకు మరమ్మతులు చేసి కొత్త నేరాలకు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. మూలన పడిన పనికి రాని ఫోనే కాదా..అని నిర్లక్ష్యం చూపకు.. విక్రయించాలనుకుంటే మీకు తెలిసిన రీ సైక్లింగ్ కేంద్రాలు, గుర్తింపు పొందిన డీలర్లకు అమ్మకోవచ్చు. కానీ ఇంటి ముందుకు వచ్చే వారు ఇచ్చే డబ్బుకు ఆశపడి పాతఫోన్లను విక్రయించొద్దని, ఫోన్ డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక మోసాలకు అవకాశం..
పాడై మూలన పడిన ఫోన్‌లో సిమ్ కార్డు మరిచిపోయినా, డేటాను ఫార్మాట్ చేయకపోయినా ఇబ్బందులు తప్పవు. వ్యకిగత చిత్రాలు, వీడియోలు, నంబర్లు నేరగాళ్లకు చిక్కితే వారి నుంచి ఆర్థిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. పాత ఫోన్‌లో బ్యాంకింగ్, యాప్‌లు, చెల్లింపుల వివరాలు కనిపిస్తే ఆర్థికపరమైన మోసాలు జరగొచ్చు. నేరం చేయకపోయినా సహకరించినట్లు భావించే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ ఫోన్లు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే జీవితాంతం కటకటాల్లో ఉండాల్సి రావొచ్చు.
నేరం ఒకరిది.. శిక్ష మరొకరిది..
ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటి(ఐఎంఈఐ) నంబర్ ఉంటుంది. సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసులు ఆ నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తారు. పాత ఫోన్ అమ్మిన వ్యక్తిని అపరాధిగా తేలుస్తారు. అసలు నేరం చేసిన వారు తప్పించుకుంటారు. ప్రజల నుంచి సేకరించిన పాత ఫోన్లను చాలా వరకు జార్ఖండ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల అడ్డాలకు తరలి వెళ్తాయి జాగ్రత్త. మరమ్మతులు చేసి నకిలీ పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను అందులో వేసి మోసాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు.
జాగ్రత్త ..
ఎవరైనా వ్యక్తికి /డీలర్‌కు ఫోన్ విక్రయిస్తే వారి చిరునామా, ఆధార్ వివరాలు సేకరించాలి. ఫోన్ అమ్మినట్లు(ఐఎంఈఐ) నంబర్ విక్రయించిన తేదీ, పేర్కొంటూ రసీదు పొందాలి. ఏరోజు ఎవరికి విక్రయించారనే సమాచారం ఉంటే .. భవిష్యత్‌లో ఆ ఫోన్ ద్వారా నేరం జరిగినా పోలీసు దర్యాప్తు నుంచి సురక్షితంగా బయట పడొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే
అవకాశం
పోలీసు కేసులు, ఆర్థిక ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని
తెలుపుతున్న నిపుణులు


