ప్రాణం తీసిన గర్భస్రావం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన గర్భస్రావం

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

జనగామ: జనగామ జిల్లాలో అబార్షన్‌ (గర్భస్రావం) వికటించి ఓ గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లికి చెందిన మల్కాపురం శ్రావణి(35)ని మండలానికే చెందిన అంబాల భాస్కర్‌ గౌడ్‌కు వివాహం చేశారు. వీరు హైదరాబాద్‌ ఫీర్జాదిగూడలో నివసిస్తుండగా, భాస్కర్‌ గౌడ్‌ ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడోసారి గర్భం దాల్చిన శ్రావణిని ఆమె అమ్మమ్మ ఊరైన దేవరుప్పుల మండలం కోలుకొండలో ఉంచారు. మరోసారి ఆడబిడ్డ పుడితే కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయనే భావనతో శ్రావణి తల్లి శోభ, కోలుకొండకు చెందిన ఆర్‌ఎంపీ శ్రావణ్‌ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్‌ఎంపీ సూచన మేరకు ఈ నెల 20న హనుమకొండలో ఓ ఇంట్లో లింగనిర్ధారణ స్కానింగ్‌ నిర్వహిస్తున్న ప్రవీణ్‌ వద్దకు వెళ్లి పరీక్ష చేయించగా, గర్భంలో ఆడశిశువేనని చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆర్‌ఎంపీ సహకారంతో జనగామ పట్టణంలోని సంజయ్‌నగర్‌లో నివాసముంటున్న ప్రైవేట్‌ వైద్య సిబ్బంది అనసూర్య వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించి అబార్షన్‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 21న ఆమె ఇంట్లోనే గర్భస్రావం నిర్వహించినట్లు తెలిపారు. గర్భస్రావం అనంతరం ఇంటికి వెళ్లిన శ్రావణికి 23న తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. తిరిగి అనసూర్యను సంప్రదించగా కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో 24న హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి అనంతరం అక్కడి నుంచి ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ 25వ తేదీన ఉదయం శ్రావణి మృతి చెందింది. ఆదివారం మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు శ్రావణి తల్లి శోభ, ఆర్‌ఎంపీ శ్రావణ్‌, నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ స్కానింగ్‌ చేసిన ప్రవీణ్‌, గర్భస్రావం నిర్వహించిన అనసూర్య నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఆర్‌ఎంపీ శ్రావణ్‌, ప్రైవేటు వైద్య సిబ్బంది అనసూర్యను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

చికిత్స పొందుతూ గర్భిణి మృతి

నలుగురిపై కేసు.. ఇద్దరి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement