కేయూ క్యాంపస్: యూనివర్సిటీ పీజీ కళాశాలలో కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఓ రవీందర్ గుండెపోటుతో శనివారం సాయంత్రం మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం చిన్నకోడెపాక గ్రామంలో రవీందర్ మృతదేహానికి కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఓఎస్‌డీ బి.వెంకట్రాంరెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ నివాళులర్పించారు. అదేవిధంగా కేయూ వర్సిటీ కాలేజీల్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవీందర్ మృతదేహానికి నివాళులర్పించారు అనంతరం జరిగిన రవీందర్ అంత్యక్రియలో రిజిస్ట్రార్ రామచంద్రం పాడె మోశారు.
రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలి..
రవీందర్ కుటుబాన్ని ఆదుకోవాలని చిన్నకోడెపాకలో రిజిస్ట్రార్ రామచంద్రంను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవీందర్ సతీమణికి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం, రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కాంట్రాక్టు అధ్యాపకులకు ఉద్యోగ భద్రతకల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రిజిస్ట్రార్ వెంటనే విషయాన్ని ఫోన్‌లో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రామచంద్రం మాట్లాడుతూ రవీందర్ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు సోమవారం కుటుంబానికి అందజేస్తామన్నారు. ఈనెల 27న యూనివర్సిటీకి వచ్చి తనను, వీసీని కలిస్తే డిమాండ్లపై చర్చిస్తామని తెలిపారు. కేయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్‌కుమార్‌లోథ్, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు భిక్షపతి, నిరంజన్, వెంకటగోపీనాఽథ్, కనకయ్య, మల్లేశ్, ఓ.మోహన్, వీరేందర్, రవీందర్, నాగేశ్వర్‌రావు, ప్రవీణ్, దేవోజీనాయక్, శ్రీధర్, నివాస్ తదితరులు పాల్గొన్నారు.


