తొర్రూరు: పేద విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ జెడ్పీ సీఈఓ ఆకుల అనురాధ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని కేజీబీవీని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. స్టోర్ రూం, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేసి అభ్యంతరాలపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. డిప్యూటీ సీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, మెనూ పాటించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, బాలికలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సౌకర్యాల కల్పనతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, ఎస్‌ఓ శైలజ, సిబ్బంది పాల్గొన్నారు.
బాల్య వివాహాల
నిర్మూలనకు కృషి చేయాలి
చిన్నగూడూరు: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్టినేటర్ మహేశ్వరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో బేటీ పడావో’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నతనంలోనే బాల్య వివాహాలు చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తాయన్నారు. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలన్నారు. పిల్లల అక్రమ రవాణా, హెల్ప్ లైన్ నంబర్లు (1098, 181, 100, 1930) గురించి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో పోష్ చట్టం–2013పై అవగాహన కల్పించి అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రెహమాన్, మహిళా సాధి కారత సిబ్బంది నలమాస అరుణ, సంధ్యారా ణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలో కేజీబీవీ యూఆర్‌ఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగ, ఉపాధ్యాయులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బానోతు హరినాయక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీ ఎదుట శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ నాయకులు ముఖ్యమంత్రికి పోస్టుకార్డు ద్వారా సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరినాయక్ మాట్లాడుతూ.. 15 సంవత్సరాల నుంచి కేజీబీవీ యూఆర్‌ఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగ, ఉపాధ్యాయులు తక్కువ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. మినిమం టైం స్కేల్, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, సమ్మెకాలపు 29 రోజుల వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు మేకల కుమార్, రాజశేఖర్, శ్రీనివాస్, సౌభాగ్య, భవాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేం..
డోర్నకల్: కోతుల బెడదతో కూరగాయలు, పప్పు దినుసుల పంటలు సాగు చేయలేమని రైతులు తేల్చి చెప్పారు. మండలంలోని చిలుకోడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డీఏఓ విజయచంద్ర మాట్లాడుతుండగా.. రైతులు అడ్డుతగిలి కోతుల బెడదతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేకపోతున్నామని తెలిపారు. పంటల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని, మంకీగన్ వాడాలని డీఏఓ రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాయల వెంకటేశ్వర్‌రావు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రామకృష్ణ, డీఈ రమేశ్, ఏఈ కిషన్, వ్యవసాయశాఖ అధికారి అనిల్‌కుమార్, ఉద్యాన అధికారి శాంతిప్రియ, ఏఈఓ అవినాష్, ఉపసర్పంచ్ రమణబోయిన రాజు పాల్గొన్నారు.


