త్రివేణి తీరం.. భక్తజనహారం | - | Sakshi
Sakshi News home page

త్రివేణి తీరం.. భక్తజనహారం

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో సరస్వతీనది అంత్య పుష్కరాలకు భక్తులు కిక్కిరిశారు. గురువారం సెలవుదినం కావడంతో తెల్ల వారుజాము నుంచి పుష్కర తీరం, ఆలయాల్లో బారులుదీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి తరలొచ్చారు. సరస్వతీఘాట్‌లో పుష్కరస్నానాలు ఆచరించారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి, అరటి డొప్పల్లో దీపాలు వదిలారు. దంపతి స్నానాలు చేశారు. పితృతర్పనాలు, పిండప్రదాన పూజలు నిర్వహించారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. రూ.100తో దర్శనం, రూ.300 స్పర్శ దర్శనాలు చేశారు.

స్వామివారి గర్భగుడిలో

కర్పూర గౌర హారతి..

భక్తులు ఉదయం 5 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో తరలి రావడంతో పార్కింగ్‌ స్థలాలు నిండుగా కనిపించాయి. అధికారులు షటిల్‌ బస్సులు వేయడంతో భక్తులు నేరుగా ఘాట్‌, అక్కడి నుంచి ఆలయానికి తరలివస్తున్నారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లలో బారులుదీరి ప్రాకారదేవతలకు మొక్కుతూ దర్శనాలకు వెళ్లారు. ఆలయంలో శివకల్యాణ మండపం వద్ద యాగశాలలో వేద పండితులు మేద దక్షిణమూర్తిహోమం, పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అంత్యపుష్కరాలో భాగంగా 8వ రోజు ఎనిమిది మంది కాశీ పండితులు ఆశుతోష్‌పాండే ఆధ్వర్యంలో స్వామివారి గర్భగుడిలో కర్పూర గౌర హారతి నిర్వహించారు. సరస్వతీఘాట్‌లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. రాష్ట్ర భాష సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో పర్పర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒడిస్సీ నృత్యం అలరించింది.

వైభవంగా హారతి,

తెప్పోత్సవం:

ఎనిమిదో రోజు కాశీ పండితులతో నవరత్నమాల హారతిని వైభవోపేతంగా నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని ఏపీలోని విశాఖపట్నానికి చెందిన శారదపీఠం శ్రీ స్వరూపనందేంద్ర ప్రత్యక్షంగా సరస్వతి వీక్షించారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ధార్మిక సలహాదారు గోవిందహరి, కలెక్టర్‌ రాహుల్‌శర్మ స్వాగతం పలికారు. అనంతరం తెప్పోత్సవాన్ని హంసవాహనంలో ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి జలవిహారం చేశారు. కాగా, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 40వేలకు మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేసి ఆలయంలో దర్శనాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. చైర్మన్‌ మోహన్‌శర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు, ఈఓ మహేశ్‌ ఉన్నారు.

తెప్పోత్సవాన్ని వీక్షించిన మాజీ సీఎస్‌..

మాజీ సీఎస్‌ శాంతికుమారి గురువారం రాత్రి కాళేశ్వరం చేరుకుని నవరత్నమాల హారతి, తెప్పోత్సవాన్ని వీక్షించారు.శుక్రవారం ఉదయం పుష్కర స్నా నాలు చేసి ఆలయంలో దర్శనాలు చేయనున్నారు.

పుష్కరాలకు ఎనిమిదో రోజు

కిక్కిరిసిన భక్తులు

కాశీ పండితులతో గర్భగుడిలో కర్పూర గౌర హారతి

అలరించిన సాంస్కృతిక

కార్యక్రమాలు

పాల్గొన్న విశాఖపట్నానికి చెందిన శారదపీఠం శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి, మంత్రి శ్రీధర్‌బాబు

Advertisement
 
Advertisement
Advertisement