వడదెబ్బతో ఐదుగురి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఐదుగురి మృతి

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వడదెబ్బతో గురువారం ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలతోపాటు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

వరంగల్‌ జిల్లాలో..

చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం శివారు మాధవనగర్‌ కాలనీకి చెందిన రూపిక సారమ్మ(73) మంగళ, బుధవారాల్లో ఎండలో వంట చెరుకు కోసం గ్రామ శివారుకు వెళ్లింది. బుధవారం సాయంత్రం వడదెబ్బతో అస్వస్థతకు గురై గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.

జేఎస్‌ భూపాలపల్లి జిల్లాలో..

మల్హర్‌/టేకుమట్ల : మల్హర్‌ మండలం కాపురం గ్రామానికి చెందిన జంగ భీమయ్య (55) బుధవారం మేకలను మేపేందుకు సమీపంలో అడవికి తీసుకెళ్లాడు. ఇంటికొచ్చిన అనంతరం సాయంత్రం వడదెబ్బతో అస్వస్థతకు గురై అర్ధరాత్రి మృతిచెందాడు. అలాగే, టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన పర్వతనేని కాంతయ్య(65) గురువారం ఇంటి ఎదుట అస్తవ్యస్తంగా ఉన్న సామగ్రిని సరిచేశాడు. కాసేపటికి అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, బుధవారం తన చిన్న కూతురు నిశ్చితార్థం జరిగింది. మరుసటి రోజే కాంతయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మహబూబాబాద్‌ జిల్లాలో..

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ వెంకటేశ్వర బజారుకు చెందిన స్వర్ణకారుడు పెందోట మోహనాచారి (52) వారం రోజులుగా ఎండలో పని కోసం ప్రతీ షాపు తిరిగాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వాంతులు, విరోచనాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు.

ములుగు జిల్లాలో..

మంగపేట: మంగపేట మండలం వాగొడ్డుగూడెం జీపీ పరిధిలోని పాతచీపురుదుబ్బ గ్రామానికి చెందిన పెండెకట్ల సారమ్మ(90)వడదెబ్బతో బుధవారం సాయంత్రం మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement