దశదిన కర్మకు వెళ్తూ అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

దశదిన కర్మకు వెళ్తూ అనంతలోకాలకు..

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

నల్లబెల్లి : పిల్లలతో కలిసి బంధువు దశదిన కర్మ కార్యక్రమాలకు బయలుదేరిన ఓ మహిళ మార్గమధ్యలో అనంతలోకాలకు చేరింది. టిప్పర్‌.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఆమె మృతి చెందగా పిల్లలకు స్వల్పగాయాలయ్యియి. ఈ ఘటన గురువారం వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం కన్నారావుపేట శివారు పద్మపురంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై సాయి ప్రసన్న కుమార్‌ కథనం ప్రకారం.. ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఈసం సులోచన(38) తన కుమార్తె సుదీక్షతో కలిసి ఆర్టీసీ బస్సులో నల్లబెల్లి మండలం కన్నారావుపేట శివారు పద్మపురంలోని తమ బంధువు దశదిన కర్మ కార్యక్రమానికి బయలుదేరింది. రాంతీర్థం గ్రామంలో బస్సు దిగిన అనంతరం పద్మపురంలోని తన బంధువుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. దీంతో తన చెల్లి కుమారుడు రాహుల్‌ బైక్‌పై రాంతీర్థం వెళ్లి పెద్దమ్మ సులోచన, చెల్లి సుదీక్షను తీసుకుని పద్మాపురం బయలుదేరాడు. మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా.. పద్మాపురం నుంచి రాంతీర్థం వైపునకు మట్టిలోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ అతివేగంగా బైక్‌ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సులోచన తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోగా, పిల్లలు సుదీష్ణ, రాహుల్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కళ్లెదుటే తల్లి రక్తపు మడుగులో పడి కొట్టుమిట్టాడుతుండడటం చూసి ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. స్థానికులు గమనించి 108లో క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో సులోచన చికిత్స పొందుతూ కన్నుమూసింది. అమ్మ ఇక లేదనే చేదు నిజం తెలుసుకున్న ఆ పిల్లల రోదనలు ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న వారిని సైతం కలచివేశాయి. ఈ ఘటనపై మృతురాలి బంధువు వట్టం సుదర్శన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మోడెం సాయిప్రసన్న కుమార్‌ తెలిపారు.

బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌.. మహిళ మృతి

పిల్లలకు స్వల్పగాయాలు.. పద్మాపురంలో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement