● అతిథి గృహ నిర్మాణంలో జాప్యం
● ఏళ్ల తరబడి భక్తులకు తప్పని తిప్పలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ అతిథి గృహ నిర్మాణం చేపడుతారా లేదా? అని భక్తులు ఎదురుచూస్తున్నారు. ఏళ్ల నుంచి అతిథి గృహం నిర్మిస్తామని చెబుతున్న ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆ పనులకు మాత్రం శ్రీకారం చుట్టడం లేదు. దీంతో భక్తులు గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతుందా? లేదా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
నిధులు ఉన్నట్లు సమాచారం..
గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన స్థలం సైతం అందుబాటులోనే ఉంది. గతంలో ఆలయానికి అనుబంధంగా ఉన్న కై లాస భవన స్థలం అందుబాటులో ఉంది. కై లాస భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం గత సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులు ఉండేవి. అప్పుడు పనులు చేపట్టకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లినట్లు ప్రచారం. అయితే ఆ నిధులు దేవాదాయ శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. ఆ నిధులకు తోడు మరిన్ని నిధులు సమకూర్చి గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటింది. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. రెండేళ్ల నుంచి నూతన పాలకమండలి గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ఏం చేస్తుందో భక్తులకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంది.
కై లాస భవన స్థలం అన్యాక్రాంతం?
కై లాస భవన స్థలం గుట్టపై ఉంది. ఏళ్ల నుంచి ఆ గుట్టపై ఉన్న కై లాసభవనం ఉత్సవ విగ్రహంలా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే చాలావరకు కై లాస భవన స్థలం అన్యాక్రాంతమైంది. చాలాఇళ్లు నిర్మాణం జరిగాయి. మరిన్ని ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. కాగా, దేవాదాయ , రెవెన్యూ శాఖల అధికారులు కై లాస భవన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూసి ఆలయానికి ఉపయోగపడే గెస్ట్ హౌస్ నిర్మాణానికి సహకరించాలని భక్తులు కోరుతున్నారు.


