పసిగట్టి.. పట్టించి | - | Sakshi
Sakshi News home page

పసిగట్టి.. పట్టించి

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

వాసన ద్వారా గంజాయి, డ్రగ్స్‌ను పట్టిస్తున్న జాగిలాలు

‘కొద్దిరోజుల క్రితం కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గంజాయి రవాణా అవుతుందనే సమాచారం మానుకోట పోలీసులకు అందింది. అప్రమత్తమైన పోలీసులు శిక్షణ ఇచ్చిన జాగిలాన్ని తీసుకొని ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఆ రైలు ఎక్కి తనిఖీ చేసుకుంటూ వచ్చారు. ఒక డబ్బాలో ఉన్న సీటుపై పెట్టిన బ్యాగును పసిగట్టిన జాగిలం ట్రైనర్‌కు సంకేతాలు ఇచ్చింది. దీంతో తనిఖీ బృందం బ్యాగు ను విప్పి చూడగా.. అందులో 10కిలోల గంజాయి ప్యాకెట్‌ బయట పడింది.’

సాక్షి, మహబూబాబాద్‌: గతంలో పోలీసు జాగిలా లను దొంగలు, హత్యచేసిన వారిని గుర్తించడం కోసం వినియోగించేవారు. మారిన కాలం, సాంకేతికత ఆధారంగా ఇప్పుడు జాగిలాల ద్వారా ఎక్స్‌ప్లోజివ్‌(పేలుడు పదార్థాలు)లను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్‌, నార్కోటిక్స్‌ రవాణా, వినియోగం గుట్టు రట్టు చేసేందుకు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి జిల్లాలకు పంపించారు. అనుమానం వచ్చిన చోటుకు జాగిలాన్ని తీసుకెళ్తే వాసన పసిగట్టి.. గుట్టు రట్టు చేయడం సులభతరం అవుతోంది.

జిల్లాకు ఆరు జాగిలాలు..

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అక్రమ రవాణా, మత్తు పదార్థాలు, మందు పాతరలు, బాంబుల బెదిరింపులు మొదలైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు వాటిని ఛేదించేలా జాగి లాలను సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లాకు ఆరు జాగిలాలు, వాటి ట్రైనర్స్‌ సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఒక జాగిలం నేరస్తుల వస్తువులు, వస్త్రాలు, రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్ల వాసన చూసి నేరస్తుల కదలికలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. నాలుగు జాగిలాలకు మందు పాతరలు, పేలుడు పదార్థాలు, బాంబులను పసిగట్టేందుకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన ఒక జాగిలానికి నార్కోటిక్స్‌ శిక్షణ ఇచ్చారు. ఇది గంజాయి, కొకై న్‌, ఇతర డ్రగ్స్‌ను గుర్తించడానికి దోహదపడుతోంది.

ఇతరులకు ఇబ్బంది లేకుండా..

పోలీసుల తనిఖీలు చేయాల్సి వచ్చినప్పుడు.. ఎవరు మంచివారో..ఎవరు నేరస్తులో ముందే తెలియదు. దీంతో అందరిని తనిఖీలు చేస్తే మంచి వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగని తనిఖీ చేయకుంటే.. వాళ్లే నేరస్తులు అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితిలో జాగిలాన్ని రంగంలోకి దింపి నేరస్తులను పట్టుకుంటున్నారు జిల్లా పోలీసులు. ప్రధానంగా జిల్లాలో గంజాయి సాగు, రవాణా, వినియోగం ఎక్కువగా ఉందనే నివేదికలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో వాటిపై ఉక్కుపాదం మోపేందుకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, అనుమానిత ప్రాంతాలు, కొరియర్‌ సెంటర్లు, కిళ్లీ కొట్లు మొదలైన ప్రాంతాలకు జాగిలాన్ని పంపించి తనిఖీలు చేయడం.. వాసన పసిగట్టిన జాగిలం అక్రమ రవాణా గుట్టు రట్టు చేయడం సులభం అవుతోంది. అదే విధంగా వినియోగించిన వారిని కూడా పసిగట్టడం.. యువత గంజాయిని వినియోగించే ప్రాంతాలను గుర్తించేందుకు జాగిలాలు ఉపయోగపడుతున్నాయి.

గంజాయి నిర్మూలనలో భాగమే..

మానుకోటను మత్తు పదార్థాలు వినియోగం లేని జిల్లాగా మార్చాలన్నదే పోలీసుల లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే ప్రజలను చైతన్య పరుస్తున్నాం. అయినా పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలన కావడం లేదు. జిల్లాలో శిక్షణ పొందిన జాగిలాలతో మత్తు పదార్థాల రవాణా గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు. ఏ మూలన దాచిపెట్టినా పసిగట్టి పట్టిస్తుంది. ప్రజలు సమాచారం ఇస్తే చాలు.. అంతా మేం చూసుకుంటాం. – శబరీష్‌, ఎస్పీ

మత్తుపదార్థాల అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రత్యేక శిక్షణ

జనసంచార ప్రాంతాలు, చెక్‌పోస్టులు, రైల్వేస్టేషన్ల వద్ద తనిఖీలు

ఇతరులకు ఇబ్బందులు లేకుండా ఛేదన

Advertisement
 
Advertisement
Advertisement