● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: క్షేత్రస్థాయిలో డెంగీ వ్యాధి నిర్మూలనకు వైద్య సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ సూచించారు. జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. డెంగీ ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని, ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. డెంగీకి ఇప్పటివరకు కచ్చితమైన ఔషధం, టీకా అందుబాటులో లేవని, రక్షణ చర్యలు పాటిస్తేనే మేలు అన్నారు. డెంగీ సోకిన వారిని కుట్టిన దోమలు ఇతరులను కుట్టినప్పుడు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. డెంగీ బారిన పడినవారు తప్పనిసరిగా దోమ తెరల్లోనే నిద్రించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీఎంఓ వాల్య, సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, ఎంపీహెచ్‌ఈఓ తోట శ్రీనివాస్, హెల్త్ సూపర్‌వైజర్ ఫహీముద్దీన్, కౌన్సిలర్ రమేష్ పాల్గొన్నారు.


