● నీటి కాలుష్యం తోడై రూ.30 లక్షల నష్టం
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువులో ఆక్సిజన్ అందకే ఇటీవల రూ.30 లక్షల విలువైన చేపలు మృత్యువాత పడినట్లు అధికారులు చెబుతున్నారు. వేసవి తీవ్రత, నీటిశాతం తక్కువ కావడం, దీనికి తోడు చెరువులోని నీరు కలుషితం కావడంతోనే చేపలు చనిపోయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే చేపలు పట్టుకుంటే నష్టం జరిగేది కాదని జిల్లా మత్యశాఖ అధికారి శ్రీపతి తెలిపారు. చెరువు పరిధిలో దేశాయిపేట, కాశిబుగ్గ, మట్టెవాడ పరిధిలో 200 మంది మత్స్యకారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మండలంలో 711 చెరువులు ఉన్నాయని, చిన్న వడ్డేపల్లి చెరువులో పరిధిలో కూడా ఆరు ఉన్నాయని వివరించారు. ఈ చెరువుల్లోని చేపలకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. అయినా చిన్నవడ్డేపల్లి చెరువులోని నీటి పరిస్థితి తెలుసుకోవడానికి వరంగల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్విరాన్‌మెంట్ శాస్త్రవేత్త శనివారం మూడు చోట్ల శ్యాంపిల్స్ సేకరించి తీసుకెళ్లారని చెప్పారు. దీని నివేదిక ఆధారంగా వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.


