హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం చింతగట్టులో మావోయిస్ట్ నేత బూర రాకేష్ పేర నిర్మిస్తున్న స్మారక స్తూపాన్ని పోలీసులు శుక్రవారం కూల్చివేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చింతగట్టుకు చెందిన మావోయిస్ట్ కీలక నేత బూర రాకేష్ మృతిచెందాడు. కుటుంబసభ్యులకు పార్ధివదేహాన్ని సైతం అప్పగించలేదు. దీంతో అతని జ్ఞాపకార్థం స్తూపం నిర్మించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వర్ధంతి సందర్భంగా స్తూపం ఏర్పాటు చేయాలని భావించినా.. పోలీసుల ఒత్తిడితో కుటుంబసభ్యులు వెనక్కి తగ్గారు. అనంతరం శుక్రవారం చింతగట్టులోని తమ ఇంటి ఎదుట స్తూపం నిర్మాణ పనులు ప్రారంభించారు. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు జేసీబీ సాయంతో నిర్మాణంలో ఉన్న స్తూపాన్ని కూల్చివేశారు. రాకేష్ తల్లిదండ్రులు స్వరూప, బూర బాబు, సోదరుడు బూర రంజిత్, వదిన బూర రేఖతో పాటు నిర్మాణ పనులు చేపడుతున్న ముగ్గురు మేసీ్త్రలను కూడా అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 3గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన తర్వాత సాయంత్రం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
మావోయిస్టు రాకేష్ పేరిట
స్తూపం నిర్మాణం
మేసీ్త్రలను కూడా అదుపులోకి
తీసుకున్న పోలీసులు


